విజయ పాల ధర పెంపు..లీటరుపై రూ.4 అదనం
విజయ డెయిరీ పాలను కొనుగోలు చేసే వారికి యాజమాన్యం ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. విజయ డెయిరీ పాల ధరలను పెంచుతూ, ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటనలో…"గేదె, ఆవు పాల ధరలను లీటర్‌కు రూ.4 చొప్పున పెంచినం. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయి" అని ప్రకటించింది. ఈ ప్రకటనతో గతంలో లీటర్‌కు రూ. 51 ఉండగా, ప్రస్తుతం ఈ ధర రూ. 55కి పెరిగింది. అర లీటర్ ప్యాకెట్ ధర రూ. 26 నుంచి రూ. 28కి పెరిగింది.
అయితే, పాడి రైతుల సమక్షంలో డెయిరీ బోర్డు సమావేశం నిర్వహించి, ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఏలాంటి సమావేశం నిర్వహించకుండానే గుట్టుచప్పుడు కాకుండా మూడు రోజుల క్రితమే ధరలు పెంచుతూ, నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరలను చూసి, విజయ్ డెయిరీ పాలను కొనుగోలు చేసే కస్టమర్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
మరోపక్క గతవారం తెలంగాణ ప్రభుత్వం విజయ డెయిరీ రైతులకు శుభవార్త చెప్పింది. లీటర్ గేదె పాల ధర రూ. 46.69 నుంచి రూ. 49.40కు, లీటర్ ఆవు పాల ధరను రూ. 33.75 నుంచి రూ. 38.75కు పెంచుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ క్రమంలో విజయ్ డెయిరీ పాల ధరలను రూ. 4కు పెంచటం సామాన్యులకు భారంగా మారింది. అయితే, సెప్టెంబర్ 10,13 తేదీల వరకు పాత రేట్లే వర్తిస్తాయని డెయిరీ యాజమాన్యం ఆ ప్రకటనలో పేర్కొంది.