మారుతున్న కాలానికి అనుగుణంగా.. మనం కూడా అప్డేట్ అవ్వాలి. లేకపోతే అవుట్ డేటేడ్ కంటెంట్ అని జనాలు పక్కన పెట్టేస్తారు. ఇక్కడ కంటెంట్ అంటే ఆలోచించడం కూడా. కొత్త ఆలోచిస్తే.. అది వింతగా అనిపిస్తే జనాలు దాన్ని ఆదరిస్తారు. అలాంటి ఆలోచనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేశాడు…ఏంటా ఐడియా…?
ఒక ఆలోచన పదిమందికి సాయం అవుతుంది అంటే.. ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అది కష్టమైనా.. వీడియో క్యాలెండర్ అనే కొత్త ఆలోచన విజయ్సేతుపతిలోని సేవాగుణాన్ని మరోసారి మెప్పు పొందేలా చేస్తుంది. పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్న నట్టుడు విజయ్ సేతుపతి. అయినా సరే తన ప్రొడక్షన్ నుంచి ఏదో ఒక కంటెంట్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది మరోసారి నిరూపితం అయింది. కొత్త సంవత్సరానికి ఎవరైనా ఫొటోలతోనే, ఇంకా ఏదైనా కాన్సెప్ట్‌తోనే క్యాలెండర్ తయారు చేయిస్తారు. కానీ విజయ్ ఈసారి కొంత సృజనాత్మకతతో వీడియో క్యాలెండర్‌ను రూపొందించాడు.
విజయ్ సేతుపతి ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో ద ఆర్టిస్ట్ పేరుతో ఒక టీజర్‌ను విడుదల చేశాడు. 2023 సంవత్సరానికి సంబంధించిన వీడియో క్యాలెండర్ సిద్ధమయింది. ఈ వీడియోలో మక్కల్ సెల్వన్.. గ్రాఫిటీ ఆర్టిస్ట్‌గా, పెయింటర్‌గా, శిల్పిగా కనిపించనున్నాడు. తన కెమెరా కన్నుతో రామచంద్రన్ అత్యద్భుతంగా దీన్ని చిత్రీకరించాడు. సృజనాత్మకతతో పాటు ఈ వీడియో రూపొందించడానికి ఒక సోషల్ కాజ్ కూడా ఉన్నది. ఈ ఆల్బమ్ ద్వారా వచ్చే డబ్బును కాసా చారిటబుల్ ట్రస్టు సంస్థ అక్షరాస్యత, నిరుపేదలకు ఆరోగ్యం వంటి కార్యక్రమాలకు అందించనున్నది. ఈ పూర్తి వీడియో క్యాలెండర్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నది. దీంతోపాటు ప్రతిష్మాత్మక పుస్తక విక్రయ కేంద్రాల్లో కూడా అమ్మకానికి ఉంచారు.