విజయక్రాంతి ఇక చీకట్లోకి.. రాజ్‌న్యూస్ కూడా బంద్! - Telugu News - Mic tv
mictv telugu

విజయక్రాంతి ఇక చీకట్లోకి.. రాజ్‌న్యూస్ కూడా బంద్!

May 4, 2019

తెలుగు రాష్ట్రాల్లో చిన్నాచితకా పత్రికలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి తాజాతాజా ఉదాహరణ. సరిగ్గా ఏడాది కిందట ఎన్నో అంచనాలతో మొదలైన విజయక్రాంతి దినపత్రిక మూతపడింది! ఈరోజే(మే 4) ఆఖరి రోజు అని యాజమాన్యం ప్రకటించినట్లు ఉద్యోగులు చెప్పారు. జీతాలు సెటిల్మెంట్ కూడా జరిగిందని, పునరుద్ధరణ వంటి ఆశలేవీ పెట్టుకోవద్దని అన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో దినపత్రికలు మూతపడ్డం కొత్తకాదు. ఆంధ్రపత్రిక నుంచి ఉదయం వరకు ఎన్నో పత్రికలు కాలానికి తగ్గట్లు మారలేక, ఈనాడు వంటి పత్రికల నుంచి పోటీ తట్టుకోలేక కాలగర్భంలో కలసిపోయాయి. అయితే రాజకీయాలకు, మీడియాకు దగ్గరి అనుబంధం వల్ల కొన్ని పత్రికలు డబ్బుబలంతో నడుస్తున్నాయి. విజయక్రాంతి పత్రిక కూడా ఏవో రాజకీయ ఉద్దేశాలతో, ‘తెలంగాణ ఉద్యమ ఫలితాలను కాపాడుకోవాలనే’ ప్రకటిత లక్ష్యంతో, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తమ వంతు లబ్ధి పొందాలనే అప్రకటిత లక్ష్యంతో మొదలైంది. కానీ, ‘కాలం కలసి రాక’ చరిత్రపుటల్లోకి ఎక్కేసింది.

యజమాని సీఎల్ రాజం గత ఏడాది మే నెల 5న దీన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఆవిష్కరించారు. మొదట్లో కొన్నిరోజుల కొన్ని ఆసక్తికర కథనాలతో బాగానే వచ్చింది. కానీ తర్వాత మూసలోకి మారిపోయింది. ‘ఏ పత్రిక చూసినా ఏమున్నది గర్వకారణం…’ అనిపించుకుంది. నమస్తే తెలంగాణతో తెలంగాణలో మరో ఆశాకిరణం వెగిలించిన రాజం కేసీఆర్ కోసం దాన్ని త్యాగం చేశారు. విజయక్రాంతిని ఎవరికీ త్యాగం చేయాల్సిన అవసరం లేకుండా అదే ఆత్మత్యాగం చేసుకుంది.

నష్టాలు, నిరాశ..

విజయక్రాంతి బీజేపీ పత్రిక అని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణలో బీజేపీకి పట్టులేదు. విజయక్రాంతే కాదు, ఇప్పటికిప్పుడు ఈనాడో, ఆంధ్రజ్యోతో ఏకపక్షంగా బీజేపీ సైడ్ తీసుకుని, జాకీలు ఎత్తిపెట్టినా ఆ పార్టీ పైకి లేవని స్థితి. విజయక్రాంతి వెనక కాంగ్రెస్ హస్తం కూడా ఉందనే ప్రచారమూ జరిగింది. రాజం, కోమటిరెడ్డి సోదరులకు లింకులు ఉన్నాయి. ఏ పార్టీకి పనిచేసినా, ఆ పనిలో సరైన నాణ్యత లేకపోయింది.

తెలంగాణ రీడర్‌షిప్‌లో తన వాటా అందుకోలేకపోయింది. ఇప్పటికే సర్క్యులేషన్‌లో సింహభాగాన్ని ఆక్రమించుకున్న ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణకు విజయక్రాంతి ఏ విషయంలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. అయినా రాజం కాంట్రాక్టర్ కావడం, సొంత ప్రెస్సు కూడా ఉండడంతో దాన్ని ఎలాగైనా నడిపిస్తారని అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, 23న వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ ఆ ఆశ లేకపోవడంతో ఇక మూసివేతే శరణ్యమైంది. పత్రిక నిర్వహణ, అందులోనూ కొత్త పత్రిక నిర్వహణ డబ్బుతో కూడిన వ్యవహారమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పత్రికల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ ప్రకటనలు సరిగ్గా రావడం లేదు. మెజారిటీ వాటా నమస్తే తెలంగాణ, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పట్టుకెళ్తుండగా, చిన్నవాటాలు సర్కారుపై ఈగ వాలనివ్వని పత్రికలు తీసుకుంటున్నాయి. మరోవైపు సర్క్యులేషన్ కూడా తీసికట్టుగా తయారైంది. కొత్త పత్రిక అని వేయించుకున్నవారు కూడా దీనికంటే నమస్తే తెలంగాణనే మేలు అని మానేశారు. విజయక్రాంతి మనుగడ కష్టంగా మారింది. ఎన్నికలేమో మరో ఐదేళ్లకుగాని రావు. ఈ లోపల పత్రికను నడపాలనే తెల్లఏనుగు వ్యవహారమే. లలితా జువెలరీ గుండాయని చెప్పినట్టు డబ్బులు ఊరకే రావు. అందుకే ఫుల్ స్టాప్ పడిపోయింది

రాజ్ న్యూస్ సంగతి..

కోమటిరెడ్డి బ్రదర్స్, పేర్లు బయటికిరాని మరికొంత కాంగ్రెస్ నేతలు నడుపుతున్న రాజ్ న్యూస్ చానల్ కూడా రేపోమాపో మూతపడిపోతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దాని అంతర్ధానానికి బోలెడు కారణాలు. తెలంగాణ కాంగ్రెస్ ఆచూకీ గల్లంతవుతోంది. ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరిపోతున్నారు. జల్లా కేడర్ కూడా.. మరో ఐదేళ్లు రికామీగా కూర్చోలేమని, కేసీఆర్ సార్ చూపుల్లో పడితే ఏదో ఒక పదవి దొరక్కపోదా అని పోలోమని వెళ్లిపోతున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణంపై ఆశలకు ఎప్పుడో నీళ్లు వదులుకుంది. పోనీ, మిగతా చానళ్లకు దీటుగా వార్తలు, కథనాలు అందించి డబ్బు చేసుకుని, ఆ డబ్బుతో చానల్‌ను నడుపుదామా అదీ అసాధ్యంగా మారింది. దీంతో ఎవరి నుంచి తీసుకుని నడిపిస్తున్నారో తిరిగి వారికే కట్టబెట్టేస్తున్నారు. చెన్నై నుంచి దాని అసలు ఓనర్లు వస్తున్నారని, త్వరలో దానికీ, కాంగ్రెస్‌కు లింకు తెగుతుందని అంటున్నారు. ఏదేమైనా, వందలాది ఉద్యోగులు పనిచేసే సంస్థలు మూతబడ్డం విషాదం. వాళ్లంతా మళ్లీ పొట్టచేతబట్టుకుని తిరగాలి.