వైఎస్సార్ జీవితచరిత్ర రాసిన విజయమ్మ.. 8న జగన్ ఆవిష్కరణ  - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్సార్ జీవితచరిత్ర రాసిన విజయమ్మ.. 8న జగన్ ఆవిష్కరణ 

July 7, 2020

Vijayamma writes her memoirs about YSR, his life and times and beyond

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితానికి ఆయన భార్య విజయలక్ష్మి అక్షరరూపం ఇచ్చారు. ‘నాలో నాతో వైఎస్సార్’ పేరుతో బయాగ్రఫీ రచించారు. తనయుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8న పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎమెస్కో దీన్ని అచ్చేసింది. వైఎస్సార్ జీవితంలో పెనవేసుకున్న బంధాలను, ఆయన మరణం తర్వాత జరిగిన రాజకీయ, కుటుంబ పరిణామాలను ఆమె ఇందులో వివరించారు. వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా దీన్ని ఆష్కరిస్తున్నారు. భర్తపై భార్య పుస్తకం రాయడం, దాన్ని తనయుడు ఆవిష్కరించడం అరుదైన సందర్భమని వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరిస్తూ విజయమ్మ ముందుమాట రాశారు. ‘ఆయన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో నాక తెలుసు. బయటి ప్రపంచానికి తెలియని ఆ మహానేత జీవితాన్ని నేను వివరించాను..’ అని ఆమె చెప్పారు. కొడుకుగా, తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా వైఎస్ జీవితంలోని భిన్న కోణాలను ఆమె ఈ పుస్తకంలో పొందుపరిచారు. వైఎస్ చిన్నవయసులో పెళ్లి, పేదల డాక్టర్‌గా పేరు, రాజకీయ ప్రవేశం, నాయకత్వ లక్షణాలు, దైవచింతన.. మరెన్నో అంశాలను ఆమె వివరించారు. ప్రజాసంక్షేమం కోసం ఆయన శ్రమించిన తీరును ప్రస్తావించారు. 

కాంగ్రెస్ పార్టీలో అంచెలంచలుగా ఎదిగిన వైఎస్ కడప జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆయన తండ్రి రాజారెడ్డి బలయ్యారు. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న వైఎస్ ఉమ్మడి ఏపీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. రెండు పర్యాయాలు సీఎంగా ఎన్నికయ్యారు. పాదయాత్రతో విశేష ప్రజాదరణ పొందిన ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. తర్వాత ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీని వదలి సొంతపార్టీ స్థాపించడం, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఇటీవలి చరిత్ర.