Vijayasai Reddy has expressed his support for the BJP candidate in the vice-presidential election
mictv telugu

బీజేపీ అడక్కుండానే జగదీప్‌కు జైకొట్టిన వైసీపీ

July 17, 2022

దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు వరుసగా జరుగనున్నాయి. సోమవారం రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనుండగా, ఉపరాష్ట్రపతి ఎన్నిక త్వరలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్ధిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌ను బీజేపీ రంగంలోకి దింపింది. రైతు కుటుంబానికి చెందిన బిడ్డగా, రాజ్యాంగంపై మంచి పట్టున్న వ్యక్తిగా ఇప్పటికే ప్రధాని మోదీ జగదీప్‌ను అభినందించారు. ఈ క్రమంలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఉదయం విజయసాయి రెడ్డి హిందీలో ట్వీట్ చేస్తూ‘రైతు బిడ్డ జగదీప్ ధన్‌కర్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టడంపై తనకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నాయకత్వలో రాజ్యసభ గౌరవం, తద్వారా దేశ గౌరవం పెరుగుతుందన్న నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికే వైసీపీ మద్ధతు తెలుపుతుందని రూఢీ అయింది. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ తాము అడక్కుండానే మద్ధతు ఇచ్చిందని ఆ పార్టీ నేత సత్యకుమార్ బహిరంగంగా వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దానిని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ఖండిస్తూ వైసీపీని బీజేపీ మద్ధతు అడగడం వాస్తవమని తేల్చి చెప్పారు. తర్వాత ద్రౌపది ముర్ము గిరిజన అభ్యర్ధి కాబట్టి మద్ధతు ఇస్తున్నామని వైసీపీ ప్రకటించుకుంది. కానీ, ఇప్పుడు బీజేపీ అడక్కుండానే మద్దతు తెలుపుతూ.. రైతు బిడ్డ కాబట్టి మద్ధతు తెలుపుతున్నామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఒకరకంగా చూస్తే వైసీపీ అధికారికంగా ఎన్డీఏలో చేరకపోయినా ఆ కూటమి భాగస్వామిలాగే ప్రవర్తిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఇది విజయసాయి రెడ్డి వ్యక్తిగత అభిప్రాయమా? లేక వైసీపీ నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది.