Vijayashanthi criticized Aamir Khan over lalsingh chadda
mictv telugu

ఆమిర్ ఖాన్‌కు విజయశాంతి వార్నింగ్

August 3, 2022

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా ఈ నెల 11న విడుదలవుతోంది. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే గతంలో అమీర్ ఖాన్ దేశం గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో కలవరపడిన అమీర్ ఖాన్.. తన చిత్రాన్ని అడ్డుకోవద్దని బహిరంగంగా కోరారు. తన మాటలను మరోలా అర్ధం చేసుకున్నారని విన్నవించుకున్నారు. అయినా ట్రోలింగ్ ఆగట్లేదు. ఇదిలా ఉండగా, నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేయగా, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, సీనియర్ నటి విజయశాంతి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించి గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గుర్తుంచుకొని దాని పరిణామాలను ఆయనకు అర్ధమయ్యేలా చేస్తున్నారు.

అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. అంతేకాక, పీకే చిత్రంలో హిందూ వ్యతిరేకతను ప్రధానంగా చూపించారు. ఇలా హిందువుల వ్యతిరేకతను మూటగట్టుకున్న అమీర్ ఖాన్ తాజాగా మరో చిత్రంతో ముందుకు వచ్చారు. దీంతో ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అందరినీ మేల్కొలుపుతున్నారు. ఈ దేశంలో హైందవేతరులు రాజకీయంగా, సినిమాపరంగా ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారో చరిత్ర చూసి తెలుసుకోవాలి. అంతెందుకు సినిమాల్లో ఖాన్ త్రయం ఇందుకు ఉదాహరణ. కానీ వారు దేశం గురించి బాధ్యత లేకుండా మాట్లాడారు. అయితే, దురదృష్టవశాత్తు మన దక్షిణాది హీరోలు అదే బాటలో పయనిస్తున్నారు. ప్రజల మనోభావాలు గుర్తించకుండా ఆయన చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ టీవీల్లో ప్రోగ్రాములు చేస్తున్నారు. ఇలా ప్రవర్తించడం సమంజసమో కాదో వారే ఆలోచించుకోవాలి’ అని ఘాటుగా హెచ్చరించారు.