విజయవాడలో ఇటీవల ప్రారంభించిన కనకదుర్గ ఫ్లైఓవర్ మూడునాళ్ల ముచ్చటగానే మారిపోయింది. ఏళ్ల తరబడి పనులు జరిగి, ప్రారంభోత్సవం కూడా అనేకసార్లు వాయిదా పడి చివరకు తెరుచుకున్న వంతెన అంతలోనే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఫ్లై ఓవర్ పిల్లర్ కింద నిలబడిన ఓ పోలీసు కానిస్టేబుల్‌పై పెచ్చులు ఊడి పడటంతో అతడు గాయపడ్డాడు. సోమవారం ఈ అపశృతి చోటు చేసుకుంది. దీంతో అతడి తల, భుజానికి గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు.
కనకదుర్గ ఆలయం సమీపంలోని అశోక పిల్లర్ వద్ద కానిస్టేబుల్ రాంబాబు విధులు నిర్వహిస్తున్నాడు. దుర్గా నవరాత్రులు కావడంతో ట్రాఫిక్ నియంత్రించే పనిలో ఉన్నాడు. అదే సమయంలో ఫ్లైఓవర్ కింద అతడిపై ఒక్కసారిగా పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ సంఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువైపు వెళ్లేందుకే భయపడిపోయారు. ఫ్లైఓవర్ ప్రారంభించిన మూడో రోజే ఇలా జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఫినిషింగ్ పనులు పూర్తికాకపోవడంతోనే పెచ్చులు ఊడిపడ్డాయని అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడుతున్నారు. పనులు పూర్తి చేయక ముందే ప్రారంభించడం దేనికని ప్రశ్నిస్తున్నారు.