5 పైసలు తీసుకొస్తే రూ. 400 భోజనం.. ఎంతమంది తెచ్చారో చూడండి.. - MicTv.in - Telugu News
mictv telugu

5 పైసలు తీసుకొస్తే రూ. 400 భోజనం.. ఎంతమంది తెచ్చారో చూడండి..

December 2, 2022

విజయవాడలోని ఓ హోటల్ వింత ఆఫర్ ఇచ్చి చిక్కుల్లో పడింది. ప్రచారం కోసం, జనాన్ని ఆకట్టుకోవడానికి 5 పైసల చిట్కా ప్రయోగించి తలపట్టుకుంది. ఇబ్బందిపడ్డా మొత్తానికి బాగానే వైరల్ అయ్యామని కొంచెం సంతోషపడుతోంది కూడా. మొగల్రాజపురంలోని రాజ్‌భోగ్ అనే రెస్టారెంట్ కథ ఇది.
ఎవరైనా సరే 5 పైసల నాణెం తీసుకొస్తే రూ. 418 రూపాయల ఖరీదైన కమ్మని వెజ్ తాళి భోజనం పెడతామని ప్రచారం చేసింది. ఎప్పుడో చలామణి నుంచి కనుమరుగైన ఫైవ్ పైసే కాయిన్లు ఎవరి దగ్గర ఉంటాయిలే అనుకుంది యాజమాన్యం.

ఒకవేళ ఉంటే గింటే ఓ పదిమంది వస్తారేమో అనుకుంది. విషయం ఊరంతా తెలియడంతో జనం సంబరపడ్డారు. ఇళ్లలో ఎక్కడెక్కడో గాలించి మరీ వందలాది ఐదు పైసల్ని సేకరించి హోటల్‌కు క్యూ కట్టారు. యాజమాన్యానికి దిమ్మతిరిగిపోయింది. వందలమందికి భోజనం పెడితే దివాలా తీస్తామని షరతులు పెట్టింది. తొలుత వచ్చిన 50 మందికే ఆఫర్ వర్తింపజేసింది. తర్వాత వచ్చినవారికి 50 శాతం డిస్కౌంటు ఇచ్చింది. 5 పైసలతో హాటల్లోకి వచ్చిన జనం హోటల్లో కిక్కిరిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 5 పైసలే కాదు, ఒక పైసా, ఆణా, దమ్మిడీలు కూడా జనం దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయని, వ్యాపారులు ఇకపై ఇలాంటి ఆఫర్లు ప్రకటించే ధైర్యం చేయబోరని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.