ఎట్టకేలకు.. కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం  - MicTv.in - Telugu News
mictv telugu

ఎట్టకేలకు.. కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం 

October 16, 2020

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ఎట్టకేలకూ ఈరోజు ప్రారంభం అయింది.‌ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దీనిని ప్రారంభించారు. ‌దీనితో పాటు రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అలాగే 16 వంతెనలకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. వాటి మొత్తం విలువ రూ. 15,592 కోట్లు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వీకే సింగ్‌, కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రి శంకర నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, సీఎం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

2.6 కి.మీల పొడవున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ.502 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా రూ.355.8 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.146.2కోట్లు ఖర్చు చేసింది. తొలుత సెప్టెంబర్ 4న సీఎం జగన్, నితిన్‌ గడ్కరీలు ఈ వంతెనను ప్రారంభించాల్సి ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆగష్టు 31న మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించింది. దీంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తరువాత సెప్టెంబర్ 18న నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సివుంది. ఆయన కరోనా వైరస్ బారిన పడడంతో ఈ కార్యక్రమం రద్దు అయింది.