కొత్త యాప్‌లో క్రికెట్ బెట్టింగులు.. విజయవాడలో ముఠా అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త యాప్‌లో క్రికెట్ బెట్టింగులు.. విజయవాడలో ముఠా అరెస్ట్

September 20, 2020

nvbn

ఎన్నో అనుమానాల నడుమ నిన్న ప్రారంభమైన ఐపీఎల్ 2020పై అప్పుడే ఆన్‌లైన్ బెట్టింగులకు ఎగబడ్డారు కొందరు నిందితులు. విజయవాడ కేంద్రంగా ఓ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సదరు ముఠా బెజవాడలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని బెట్టింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి నిందితులను పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. గదిలో ఉన్న అన్‌లైన్ బెటింగ్ సెటప్ స్వాధీనం చేసుకున్నామని డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. 

మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో దాడిచేసి పట్టుకున్నామని చెప్పారు. ‘అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్‌లో పందాలు కాస్తారు. రూ.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని తెలిసింది. ఈ వ్యాలెట్ ద్వారా నగదు వ్యవహారాలు చేస్తున్నారు. యాప్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడ్డ ముఠాలో ప్రధాన సూత్రధారి అయిన నవీన్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం’ అని వివరించారు. కాగా, ఐపీఎల్ రోజుల్లో ఎక్కడ బెట్టింగ్‌కు పాల్పడ్డా ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని డీసీపీ కోరారు. విద్యార్ధులు ఎవరూ ఇలాంటి బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దని కోరుతున్నామని చెప్పారు.