ఆవుపై కాల్పులు.. సానియా మీర్జా ఫామ్‌హౌస్ కోణం! - MicTv.in - Telugu News
mictv telugu

ఆవుపై కాల్పులు.. సానియా మీర్జా ఫామ్‌హౌస్ కోణం!

October 27, 2020

వికారాబాద్‌లో నాలుగు రోజుల క్రితం ఆవుపై కాల్పులు జరిపిన కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ క్రీడాకారిణీ సానియా మీర్జా, ఆమె బంధువులకు సంబంధించిన ఫాం హౌజ్ సమీపంలోనే ఇది జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫాం హౌజ్ వద్దకు పశువులు రాకుండా తరుచూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈసారి నేరుగా ఆవుపై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సానియా మీర్జా ఫాం హౌజ్ ఇంచార్జ్ ఉమర్‌ను అరెస్ట్ చేశారు. 

దామగుండంలో  సానియా మీర్జా, ఆమె బంధువులకు ఫాం హౌజులు ఉన్నాయి. స్థానికులు తరుచూ అక్కడ పశువులను మేపుతూ ఉంటారు. కానీ అక్కడ ఉండే నిర్వాహకులు వారిని తరుచూ బెదిరింపులకు గురి చేసేవారని చెబుతున్నారు. కాల్పుల ఘటనకు ముందు రోజే పశువులు తీసుకురావద్దని  హెచ్చరించారని అంటున్నారు. కాల్పు ల శబ్ధం విని తాము వచ్చేలోపు దాడికి పాల్పడిన వారు పారిపోయినట్టుగా తెలిపారు. దీంతో  ఫామ్ హౌజ్ కు చెందిన వారే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. బుల్లెట్లను స్వాధీనం చేసుకొని అవి ఏ రివాల్వర్ నుంచి వచ్చాయని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.