వికారాబాద్ కిడ్నాప్.. భర్తపై ఇష్టంతోనే వెళ్లానంటూ ఫోన్! - MicTv.in - Telugu News
mictv telugu

వికారాబాద్ కిడ్నాప్.. భర్తపై ఇష్టంతోనే వెళ్లానంటూ ఫోన్!

September 29, 2020

Vikarabad incident .. she went to her husband at will!

వికారాబాద్‌లో ఓ మహిళ కిడ్నాప్ తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న దీపిక షాపింగ్‌కి వెళ్లొస్తూ కిడ్నాప్‌కి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే అది ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాదని పోలీసులు స్పష్టంచేశారు. కిడ్నాప్‌ కథను ఛేదించే క్రమంలో పోలీసులు ఏడు టీంలుగా రంగంలోకి దిగారు. ఎట్టుకేలకు పురోగతి సాధించారు. తాను ఇష్ట పూర్వకంగానే తన భర్త అఖిల్‌తో వెళ్లిపోయినట్టు ఆమె ఓ ఎస్సై స్థాయి అధికారికి ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. వికారాబాద్ పోలీసులకి ఫోన్ చేసి తాను తన భర్త వద్ద క్షేమంగానే ఉన్నానని ఆమె చెప్పినట్టు సమాచారం. 

అయితే పోలీసులు వారిద్దరినీ వికారాబాద్ పోలీస్ స్టేషన్‌‌కి రమ్మని కోరారు. దీంతో వారు కాసేపట్లో అక్కడికి రానున్నారు. కాగా, 2016లో దీపిక, అఖిల్‌లు ప్రేమించుకుని మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టంలేని ఆమె తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం  యువతిని ఇంటికి తీసుకొచ్చేశారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్దపడింది. ఈ కేసు గురించి వికారాబాద్‌ కోర్టుకి హాజరైన రోజే దీపికను కారులో ఎత్తుకువెళ్ళడం తీవ్ర కలకలం రేపింది. కిడ్నాప్‌కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఇష్టపూర్వకంగానే భర్త వెంట వెళ్లినట్టు తేల్చారు.