విక్రమ్ ముక్కలు కాలేదు.. ఓ వైపు ఒరిగిందంతే..  - MicTv.in - Telugu News
mictv telugu

విక్రమ్ ముక్కలు కాలేదు.. ఓ వైపు ఒరిగిందంతే.. 

September 9, 2019

Vikram Lander.

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలోచంద్రుడిపై  ల్యాండర్ విజయవంతంగా దిగకపోవడంతో అంతా నిరాశకు గురయ్యారు. ల్యాండర్ విక్రమ్ నుంచి సిగ్నల్స్ రాకపోవడతో కూలిపోయిందని అంతా అనుకున్నారు. కానీ దాని ఆచూకీ కోసం వేట సాగించిన ఇస్త్రో తాజాగా తీపి కబురు వినిపించింది. ల్యాండర్ విక్రం ఆచూకీ లభించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆర్బిటర్ తీసిన ఛాయ చిత్రాల ఆధారంగా చంద్రుడి ఉపరితలంపై దాన్ని గుర్తించినట్టు తెలిపారు. 

నిజానికి 2.1 కిలోమీటర్ ఎత్తులో నుంచి 27 కిలోల బరువు ఉన్న ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై పడిపోయి ముక్కలైందని అంతా అనుకున్నారు. కానీ ఆర్బిటార్ పంపిన చిత్రాల ఆధారంగా ఎటువంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా దిగినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్ సింగిల్ పీస్‌గానే ఉందని అంటున్నారు.నిర్దేశిత లక్ష్యానికి అతి దగ్గరగా ల్యాండర్‌ హార్డ్‌ ల్యాండ్ అయినట్టు గుర్తించారు. అయితే అది ఒక పక్కకు వంగి ఉందని చెబుతున్నారు. ల్యాండర్ ముక్కలై ఉంటే పనిచేసే అవకాశాలు తక్కువగా ఉండేవని కానీ అదేం జరగకపోవడంతో ప్రయోగంపై మరోసారి ఆశలు చిగురించాయి.

ల్యాండర్‌లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్‌ కేవలం 14 రోజులు మాత్రమే పనిచేసేలా దాన్నిరూపొందించారు. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోవడంతో మరో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపు దానితో కమ్మూనికేషన్ ఏర్పరుచుకునేందుకు శాస్త్రవేత్తలు యాంటీనాల సాయంతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సిగ్నల్‌ను తిరిగి సంపాదించడం కష్టమైనప్పటికీ శాస్త్రవేత్తలు తమ వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే చంద్రుడిపై  ప్రజ్ఞాన్ రోవర్‌ పరిశోధనలు చేపట్టే అవకాశం ఉంది.