చాలా వరకు గ్రామాల్లో ఏదైనా సమస్య వస్తే గ్రామ, కుల పెద్దలు కూర్చుని పరిష్కరించేందుకు కృషి చేస్తారు. దాదాపు 90 శాతం సమస్యలు ఈ పంచాయితీల్లోనే పరిష్కారానికి నోచుకుంటాయి. కానీ, కొన్ని మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతుంటాయి. ఇలాంటి ఘటన ఒకటి అసోంలో జరిగింది. గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి ఓ వ్యక్తిని దోషిగా తేల్చి నిలువునా తగులబెట్టేశారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగోన్ జిల్లాలోని బోర్‌లులుగావ్ గ్రామంలో ఇటీవల ఓ మహిళ హత్య జరిగింది. రంజిత్ బార్దోలోయ్ అనే వ్యక్తిపై అనుమానంతో గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. అందులో రంజిత్‌ను దోషిగా తేల్చారు. తర్వాత శిక్షగా అందరి ముందే అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం శవాన్ని గుంత తీసి పూడ్చి పెట్టారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పూడ్చిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి పంపారు. శవానికి 90 శాతం పైగా కాలిన గాయాలుండగా, పలువురు గ్రామపెద్దలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.