village sarpanch protest collected garbage from door to door in AP
mictv telugu

నిధులు నొక్కేసిన ప్రభుత్వం.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించిన సర్పంచ్

September 8, 2022

ప్రభుత్వ వైఫల్యాలను అందరి దృష్టికి తీసుకెళ్తూ.. అధికారుల్లో చలనం కలిగించేలా సమస్యలకు పరిష్కారానికై వినూత్న నిరసనకు దిగుతున్నారు కొంతమంది. ఇటీవల ఆగష్ట్ నెలలో కేరళలో ఓ వ్యక్తి నడిరోడ్డుమీద పడ్డ గుంతలోనే స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం.. యోగా చేయడం లాంటి పనులతో నిరసన వ్యక్తం చేశాడు. ఎడతెరిపి లేని వర్షాలకు కారణంగా రోడ్లన్నీ నీటిగుంతలుగా మారాయని తెలియజేస్తూ.. ఆ గుంతల వద్ద స్నానం చేస్తూ నిరసనకు దిగాడు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఏకంగా స్థానిక ఎమ్మెల్యేనే క్రిందకు దిగొచ్చారు. అతనికి నచ్చ జెప్పి రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు.

కాగా పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కాట్రపాడు గ్రామ సర్పంచ్ మేదరమెట్ల శంకర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కూడా బుధవారం విచిత్ర నిరసనకు దిగారు. పారిశుద్ధ్య కార్మికులుగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేశారు. ప్రభుత్వం అందించిన మూడు చక్రాల చెత్త సేకరణ బండి నడిపిస్తూ, విజిల్ ఊదుతూ గ్రామంలో తిరిగారు. గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.6 లక్షల 14,15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మార్గంలో తీసుకుందని సర్పంచ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు కూడా అందకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు పనులకు రావడంలేదని, దీంతో ఇళ్ల వద్ద చెత్త పేరుకుపోయిందని ఆరోపించారు. దీంతో తాము ఈ నిరసన చేపట్టారు. సర్పంచి చెత్త సేకరిస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను అనుసరించారు.