బైక్పై నిర్మానుష్య ప్రాంతానికి చేరుకొని కబుర్లు చెప్పుకుంటున్న యువ ప్రేమికులపై గ్రామస్థులు దాడిచేసి వీడియో తీసిన సంఘటన బీహార్లో వెలుగుచూసింది. వివరాలు.. గయకు సమీపంలోని ఓ గ్రామ శివారులో ప్రేమికులిద్దరూ ఏకాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నారు. వారిని చూసిన గ్రామస్థులు ఏ కులానికి చెందిన వారంటూ ప్రేమికులపై దాడికి తెగబడ్డారు. ఆధార్ కార్డులు చూపించమని కర్రలతో కొట్టారు. ఇంకెప్పుడూ ఈ ప్రాంతానికి రాము, క్షమించమని వేడుకుంటున్నా ఆగలేదు.
ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అక్కడే పెళ్లి చేసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేయడంతో యువతి ఏడుపు మొదలు పెట్టింది. తమను వదిలేయమని బ్రతిమిలాడింది. ఫోటోలు, వీడియోలు తీస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అయినా గ్రామస్తులు వినకుండా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో స్థానికంగా ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసుల వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదనీ, వస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.