ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన సీనియర్ నటుడు చలపతిరావు మరణంతో ఆయన సొంతూరు కృష్ణా జిల్లా బల్లిపర్రులో విషాదఛాయలు అలుముకున్నాయి. మహా నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గరి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు అని ఆయన గ్రామస్తులు అన్నారు.. తమ గ్రామానికి చెందిన మంచి నటుడు మరణించడం తమను ఎంతో బాధించిందన్నారు గ్రామస్తులు.. తమ గ్రామానికి ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే వారని వారన్నారు. తమ గ్రామానికి ఎంతో సేవ చేశారని వారన్నారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని, మంచి మిత్రుణ్ణి కోల్పోయామని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలో తనకున్న స్థలంలో ఒక చిన్న ఇల్లుని నిర్మించారని దానిని తన సోదరి అయిన భ్రమరాంబకు ఇచ్చారన్నారు.
ఏటా గ్రామానికి వచ్చి స్థానికులు, బంధువులతో ఆయన ముచ్చటించే వారని, గ్రామంలో ఉన్న 1.40 ఎకరాల పొలాన్ని చలపతిరావే సాగు చేస్తుండేవారని వారు తెలిపారు. బల్లిపర్రులో మర్రిచెట్టు, చెరువు గట్టుపై సేద తీరడం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని, ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా ఏటా మే నెలలో గ్రామానికి వచ్చి వెళ్తుండేవారని చెప్పారు. ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే తోచిన సాయం చేసి సమస్య పరిష్కరించే వారని బంధువర్గాలు చెబుతున్నారు. మంచినీటి ట్యాంకు నిర్మాణానికి రూ.1.5 లక్షలు, గంగానమ్మ ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళమిచ్చి గ్రామాభివృద్ధికి కూడా పాటుపడ్డారు. పక్క గ్రామమైన పెదమద్దాలి కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయానికి గ్రిల్స్ ఏర్పాటు చేశారని వారు గుర్తుచేశారు. అత్తవారి ఇల్లు కూడా పామర్రు మండల పరిధిలోని జమీగొల్వేపల్లి గ్రామం కావడంతో అక్కడి వారితో కూడా సత్సంబంధాలున్నాయని తెలిపారు.