కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆపిన నాటుకోడి - MicTv.in - Telugu News
mictv telugu

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆపిన నాటుకోడి

November 24, 2022

ఈ కాలంలో మనుషుల్ని చంపితేనే దిక్కు లేదు అలాంటిది కోడిని చంపారని రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. తమకు న్యాయం జరిగేవరకు కదలమని భీష్మించుకుని కూర్చున్నారు ఫలితంగా కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. వినడానికి వింతగా ఉన్న ఇది నిజంగా జరిగింది. ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే. వివరాల్లోకెళితే.. కుమురం భీం అసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం పోచమ్మ వాడ బాబా సాగర్ గ్రామంలో ప్రధాన రహదారిపై లారీలు కంకర లోడుతో వెళ్లుంటాయి. అయితే ఓ లారీ వెళ్తున్న సమయంలో గ్రామానికి చెందిన ధంద్రే బండయ్యకు చెందిన ఓ కోడి రోడ్డుపైకి వెళ్లింది. అనుకోకుండా ఆ లారీ కోడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన కోడి రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది.

కోడి మరణం తెలుసుకున్న బండయ్య తోటి గ్రామస్థులను వెంటేసుకొని కోడి ప్రాణం తీసిన లారీని పట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ రహదారిపై కిలోమీటర్ల మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేవరకు ఇక్కడ నుంచి కదలమని గ్రామస్థులు మొండి పట్టుదలతో రోడ్డుమీద కూర్చున్నారు. కానీ, ఎలాంటి న్యాయం కావాలో చెప్పడం లేదు. మనిషిని చంపితే పోలీసులు, జైళ్లు ఉంటాయి. మరి కోడిని చంపితే ఏం చేస్తారు? అనే ఆసక్తి చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొంది. చూద్దాం మరి ఏ న్యాయం చేస్తారో.