గ్యాంగ్ రేపిస్టులను తగలబెట్టిన గ్రామస్తులు.. - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాంగ్ రేపిస్టులను తగలబెట్టిన గ్రామస్తులు..

June 9, 2022

Villagers pouring petrol on two young men in jarkhand

సమాజంలో అమాయక బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతీరోజు దేశంలో ఏదో ఒకచోట ఈ తరహా ఘటనలు నిత్యం జరుగుతూ ఉండడం బాధాకరం. ఏం చేస్తే ఈ అత్యాచారాలు ఆగుతాయో అటు ప్రభుత్వం కానీ, మానసిక నిపుణులు కానీ, సమాజ శాస్త్రవేత్తలు కానీ నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. తాజాగా జార్ఖండ్‌లో ఓ బాలికపై ఇద్దరు యువకులు లిఫ్టు పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. సదార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు పనిమీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వారి వెంట వారి మైనర్ కూతురు ఉంది.

చీకటి పడడంతో ముగ్గురూ ఏదైనా వాహనం దొరక్కపోతుందా? అంటూ బస్టాండులో వేచి చూస్తున్నారు. ఇంతలో వీరి పొరుగూరికి చెందిన ఇద్దరు యువకులు అటుగా వచ్చి ఊరిలో దిగబెడతామని చెప్పి బాలికను ఎక్కించుకున్నారు. దంపతులు కూడా వారిని నమ్మి బాలికను వారితో పంపించారు. ఆ తర్వాత ఎలాగోలా ఇంటికి చేరిన దంపతులకు బాలిక ఇంట్లో కనపడకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. కాసేపటికి ఊరి చివర ఓ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉందని సమాచారం అందడంతో వెళ్లి చూడగా, అది తమ కూతురేనని తేలింది. దీంతో ఆగ్రహించిన దంపతులు, వారి గ్రామస్థులు యువకుల గ్రామానికి వెళ్లి వారిని వెతికి పట్టుకున్నారు. వారిని తమ ఊరికి లాక్కొచ్చారు. తీవ్రంగా కొట్టి వారిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టేశారు. వారు ప్రయాణించిన బైక్‌ను కూడా మంటల్లో తోసేసి తమ కడుపు మంటను చల్లార్చుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే గ్రామంలోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మంటల్లో కాలిపోయిన ఇద్దరు యువకులను ఆస్పత్రికి తరలించగా వారిలో ఒకడు అప్పటికే మరణించి ఉన్నాడు. మరొక యువకుడు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా, దాడికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బలగాలను మొహరించారు.