చిట్టీల పేరుతో మోసం చేసిందని ఓ మహిళ పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. స్థంభానికి కట్టేసి కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి వివరాలు ఇలా ఉన్నాయి. కొమరాడ మండలం శివిని గ్రామంలో శోభ అనే మహిళ నివసిస్తోంది.
చిట్టీల పేరుతో రైతుల నుండి కోటీ యాభై లక్షల రూపాయలను వసూలు చేసింది. జమ చేసిన డబ్బులను తిరిగి చెల్లించకుండా, ఇబ్బందులకు గురి చేయడంతో గ్రామస్థులు ఆగ్రహించారు. రైతులు, మహిళలు కలిసి శోభను రామ మందిరం వద్ద ఉన్న స్థంభానికి కట్టేసి దాడి చేశారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులను వారించి మహిళ కట్లు విప్పారు. శోభపై ఇప్పటికే అప్పు ఎగ్గొట్టిన కేసు కోర్టులో కొనసాగుతుందనీ, ఇలా దాడులు చేయడం సరికాదని చెప్పారు. మహిళను కట్టేసిన వారిపై కేసులు పెట్టాల్సి వస్తుందని ఎస్ఐ హెచ్చరించారు. దీంతో గ్రామస్తులు మొదట శాంతించగా, అనంతరం ఎస్ఐ వైఖరిపై తమ నిరసన తెలియజేశారు.