మటన్ పార్టీలో మహాగణపతి! - MicTv.in - Telugu News
mictv telugu

మటన్ పార్టీలో మహాగణపతి!

September 6, 2017

పుర్రెకో బుద్ధి, నాలుకకో రుచి అన్నట్టు ఆస్ట్రేలియాలోని ఓ మాంసం అమ్మే కంపినోళ్లు ఇగురం తప్పిన ఓ యాడ్ జేసి అందరిచేత అంక్షింతలు  ఏపిచ్చుకుంటున్నరు. మనం నీసు తిని దేవుళ్ల దగ్గరకోతమా? అది గుడ దేవుళ్లల అందరికంటే ముందే తొలి పూజలు అందుకునే  గణేశుని దగ్గరికోతమా? గణ్పతి పండగస్తనే నియమ నిష్టలతోని కౌసు ముట్టకుంట పూజ జేస్తం. బొజ్జ గణపయ్యకు మస్తు ఇష్టమని నైవేద్యంగ ఉండ్రాళ్లు, పాశం అండి పెడ్తం. కనీ ఆస్ట్రేలియాలున్న  ఓ మాంసం అమ్మే కంపినోళ్లు  ఏకంగా వినాయకునికే మాంసం తినిపిచ్చే పని ముంగటేస్కున్నరు. వీళ్ల ఇగురం సల్లగుండ. ఆ కంపినీ మాంసం మంచిగ అమ్ముడు పోవాలని ఓ అడ్వటైర్జ్మెంట్ తీసిండ్రు. అన్ల  మనం భక్తితోని కొలిచే  వినాయకునితో పాటు  జీసస్ ,బుద్ద ఇట్ల అందరు దేవుళ్లు డైనింగ్ టేబుల్ మీద కుసొని మనమందరం గొర్రె మాంసాన్ని  తింటూ  ముచ్చట వెట్కుండ్రు. మరి ఏ పుణ్యాత్మునికి వచ్చిందో గింత బిత్తిరి ఆలోశన. ముందు వాన్ని పట్కొని తన్నాలే అని హిందువులందరు గరమైతున్నరు.

వీళ్లుకు  ప్రకటన చెయ్యనీకి మనుష్యులు దొర్కలేదా, ఏమో దేవుళ్ల తోని పరాష్కమాడుతున్నరు అని ప్రపంచంలున్న వినాయక భక్తులందరు  పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నరు. మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉండే  ఈ యాడ్  తప్పని ఆస్ట్రేలియాలోని హిందువులు గుడ గరమైతుండ్రు.  దీనిపై స్పందించిన ఆస్ట్రేలియన్ స్టాండర్డ్స్ బ్యూరో ‘ఎంఎల్ఏ’పై విచారణ ప్రారంభించింది. గణపతిని మాంసాహార భక్షుడిగా చూపించడం హిందువుల మనోభావాలను కించపరచడమేనని, దీన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఆస్ట్రేలియాలో హిందువుల ప్రతినిధి  డిమాండ్ చేశారు. ఇగ ఈ వివాదంపై ఆ కంపినోళ్లను అడిగితే  తామేమీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని, యాడ్‌ను ఉపసంహరించ బోమని స్పష్టం చేసిన్రట.