Vinayakan Mandapam..Rs. 316 crore insurance
mictv telugu

వినాయకుని మండపానికి..రూ.316 కోట్ల బీమా

August 30, 2022

దేశవ్యాప్తంగా రేపటి నుంచి వినాయక చవితి ఉత్సహలు అంగరంగ వైభవంగా మొదలుకానున్నాయి. ఇప్పటికే వినాయకుని భక్తులు, నిర్వాకులు మండపాలను వివిధ రకాల డిజైన్‌లతో, మండపాల చుట్టు లైట్‌లను అమర్చారు. ఈ క్రమంలో ముంబైలోనే అత్యంత సంపన్న గణేశ్‌ మండల్‌గా పేరుగాంచిన.. జీఎస్‌బీ సేవా మండల్‌ ఈసారి గణేశ్ మండపానికి రూ.316.4 కోట్ల బీమా చేయించి రికార్ట్ సృష్టించింది. అంతేకాదు, మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడు కూడా బీమా పరిధిలోకే వస్తాడని పేర్కొంది.

జీఎస్‌బీ సేవా మండల్‌ చైర్మన్‌ విజయ్‌ కామత్‌ మాట్లాడుతూ..” ముంబై నగరంలో గత 68 ఏళ్లుగా ఈ మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి మా మండపానికి రూ.316.4 కోట్ల బీమా చేయించాం. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి వేడుకల్లో మండపాన్ని దర్శించే ప్రతి భక్తుడు కూడా బీమా పరిధిలోకే వస్తాడు. ఈ మొత్తం బీమాలో రూ.31.97 కోట్లు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు, సామగ్రికి వర్తిస్తుంది. ఇక, రూ.263 కోట్ల బీమా మండపానికి, వాలంటీర్లకు, పూజారులకు, వంటవాళ్లకు, పాదరక్షల స్టాల్‌ కార్మికులకు, పార్కింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు వర్తిస్తుంది. అగ్నిప్రమాదం, భూకంపం సంభవిస్తే పరిహారం పొందడానికి గాను ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, స్కానర్లకు రూ.కోటితో ఇన్సూరెన్స్‌ చేయించాం. విఘ్న వినాయకుడి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి భక్తుడికి భద్రత కల్పించాలన్నదే మా ఉద్దేశం” అని ఆయన అన్నారు.

ఇక, వినాయక చవితి విషయానికొస్తే.. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా పెద్ద హడావుడి ఉంటుంది. మహారాష్ట్రలో అయితే ఇంకాస్త హడావుడి ఉంటుంది. 10 రోజల పాటు భారీ మండపాలు, అతి భారీ విగ్రహాలతో ముంబై వీధులు కళకళలాడిపోతూ ఉంటాయి. ఈసారి కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ముంబైలోని జీఎస్​బీ సేవా మండల్​..గణేశ్​ ఉత్సవాల కోసం ఏకంగా రూ. 316.40కోట్లు విలువ చేసే బీమాను తీసుకురావటం హాట్ టాపిక్‌గా మారింది.