దేశంలో తొలిసారి.. బట్ట ఫ్లెక్సీలతో ప్రచారం..  - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో తొలిసారి.. బట్ట ఫ్లెక్సీలతో ప్రచారం.. 

October 27, 2019

movie .

సినిమాలు విడుదల అయినప్పుడు గానీ, ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలవారు చేసే ప్రచారంతో అడుగడుగునా ఫ్లెక్సీలు నిండిపోతుంటాయి. అయితే అవి ప్లాస్టిక్‌తో తయారవడంతో పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. దీనిని కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గత నెల పీవీసీతో చేసే ఫ్లెక్సీ బోర్డులపైన ప్రభుత్వం నిషేధం విధించింది. వాటికి ప్రత్యామ్నాయంగా భూమిలో సులభంగా కరిగిపోయే బట్టలూ, పాలీఇథనాల్ వంటివి వాడాలని సూచించింది. ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు ఓ సినిమా ఫ్లెక్సీలను బట్టతో చేసినవే వాడారు. దేశంలో ఇలా పర్యావరణహిత ప్రచారం మొదలుపెట్టిన తొలి సినిమాగా ‘ప్రణయ మీనకులూడే కడల్’ రికార్డు సృష్టించింది. దీంతో కేరళ ప్రభుత్వం దర్శకుడు కమల్, నిర్మాత జాన్‌ను ప్రత్యేకంగా అభినందించింది. 

తొలుత ప్రభుత్వ నిర్ణయంపై మలయాళ సినిమా పరిశ్రమవాళ్లు ఎన్నో తర్జనభర్జనలు పడ్డారు. పీవీసీ కాకుండా ఇతరత్రా వాటితో చేసే ఫ్లెక్సీలు అంత ఆకర్షణీయంగా ఉండకపోవడం అటుంచితే, ఖర్చు కూడా ఎక్కువ అని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. కానీ, అవన్నీ పట్టించుకోకుండా ఈ సినిమాకు బట్ట ఫ్లెక్సీలనే వాడటం మలయాళ చిత్ర పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.