పంచకులో కాల్పులు.. ఐదుగురి  మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పంచకులో కాల్పులు.. ఐదుగురి  మృతి

August 25, 2017

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీమ్ బాబాను రేప్ కేసులో సీబీఐ దోషిగా తేల్చడంతో పంజాబ్, హరియాణాలు అట్టుడుకుతున్నాయి.  పలు చోట్ల బాబా అనుచరులు అల్లర్లకు దిగారు.  పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఐదుగురు ఆందోళనకారులు మృతిచెందారు. తీర్పు ఇచ్చిన పంచకులలోని కోర్టు వెలుపల గుర్మీత్ అనుచరులకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. బాబా అనుచరులు పలు వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మీడియా వాహనాలనూ వదల్లేదు. వాటిపై రాళ్లతో దాడి చేశారు.  ఇరు పక్షాల మధ్య ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.

పోలీసులు గాల్లోకి కాలుపులు జరిపి,  లాఠీ చార్జి చేసి వారిని తరిమికొట్టారు. పంజాబ్ లోని మౌలత్ రైల్వే స్టేషన్ కు కూడా బాబా భక్తులు నిప్పుపెట్టారు. దగ్గర్లోని ఓ పెట్రోల్ బంకును కూడా తగలబెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి. భటిండా, ఫిరోజ్ పూర్, మాన్సా తదితర నగరాల్లో కర్ఫ్యూ విధించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పెద్ద సంఖ్యలో సైనికులను, పోలీసులను రంగంలోకి దించారు.  ప్రజలు సంయమనం పాటించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కోరారు. గుర్మీత్ ను చట్ట ప్రకారం కోర్టు దోషిగా తేల్చిందని, దీనిపై కోపంతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం విచారకరమని అన్నారు.

మరోపక్క.. గుర్మీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అతణ్ని హెలికాప్టర్ లో రోహహత్ జైలుకు తరలించనున్నారు.