ఈ కాలంలో యువతీయువకుల మధ్య ప్రేమ సాధారణంగా మారింది. కొందరు ఒకే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తమ బంధాన్ని వివాహం వరకు తీసుకెళ్తుంటే మరికొందరు మాత్రం యూజ్ అండ్ త్రో పద్ధతిని అవలంబిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని లేదా ఒకరి తర్వాత మరొకరు అంటూ ప్రేమ పేరుతో మోసం చేస్తుంటారు. అలా మోసపోయిన వాళ్లు తమ లవర్ వేరే వారిని పెళ్లి చేసుకుంటే మండపం వద్దకు వచ్చి గొడవ చేయడం చూస్తుంటాం. దాంతో జరుగుతున్న పెళ్లి ఆగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా ఓ యువకుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గతంలో తమను ప్రేమ పేరుతో మోసగించాడని యువకుడి పెళ్లి మండపం ముందు మాజీ ప్రియురాళ్ళు ఆందోళన చేపట్టారు. తమను కాదని పెళ్లి చేసుకుంటున్న నిన్ను వదిలి పెట్టమని, జీవితాన్ని నాశనం చేస్తామని శపథం చేస్తున్నారు. చైనాలోని యున్నన్ ప్రావిన్సులో జరిగిన ఈ ఘటన ఆ దేశ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళితే.. చెన్ అనే యువకుడికి ఫిబ్రవరి 6న వివాహం జరిగింది. ఆ సమయంలో పెళ్లి మండపం వద్ద అతని మాజీ ప్రియురాళ్లు ప్రత్యక్షమయ్యారు. చేతిలో ‘మేం మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమంతా కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం’ అని రాసి ఉన్న బ్యానర్‌ని పట్టుకుని తమ నిరసన తెలియజేశారు. వచ్చిన అతిథులంతా బ్యానర్ చూసి ఏం జరిగిందని ఆసక్తిగా ఆరా తీయగా.. హఠాత్తుగా జరిగిన పరిణామానికి బేంబేలెత్తిన వధువు పేరెంట్స్ ఏం జరిగిందని వరుడు చెన్‌ని నిలదీశారు. అప్పుడు చెన్ స్పందిస్తూ నిజాయితీగా నిజాన్ని ఒప్పుకున్నాడు. గతంలో వారితో తిరిగిన మాట వాస్తవమేనని, అంతేకాక ఓ చెడు వ్యక్తిగా వారితో ప్రవర్తించానని చెప్పాడు. అప్పట్లో మానసిక పరిపక్వత లేనందున చాలా మంది అమ్మాయిలను బాధపెట్టానని అంగీకరించాడు. అయితే ఇలా వచ్చి ఇబ్బంది పెట్టడం బాధకు గురి చేసిందన్నాడు. దీని వల్ల నూతన వధువు తనతో గొడవ పెట్టుకుందని వాపోయాడు. ఇక చివర్లో తెలుగు సినిమా స్టైల్లో డైలాగ్ వదిలాడు. ‘అమ్మాయిలను మోసం చేయవద్దు. వారిని నిజాయితీగా ప్రేమించాలి. లేదంటే ఆమె ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే భవిష్యత్తులో మీరు బలవుతారు’ అంటూ క్షమాపణలు చెప్పాడు. ఇంత జరిగినా వారితో విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించకుండా తప్పించుకున్నాడు చెన్.