తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనే రకం మనుషులు చాలామందే ఉంటారు. లెక్కలో చిన్న తేడా వచ్చినా దృశ్యం మామూలుగా ఉండదు. పేకాట మాత్రమే కాదు, ఏ విషయంలోనైనా సరే కొందరుగా పక్కాగా ఉంటారు. ఒక్క రూపాయి తేడా వచ్చినా ఊరుకోరు. బెంగళూరుకు చెందిన రమేశ్ నాయక్ అలాంటి రకమే. కేవలం ఒక్క రూపాయి చిల్లర కోసం కోర్టుకెక్కాడు. ఐదేళ్లలో ఏన్నో సాక్ష్యాలు, విచారణలు, వాయిదాలు అన్నీ ముగిశాక కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసుకు మూలం చిన్న సిటీ జర్నీ. రమేశ్ నాయక్ 2019లో శాంతి నంగర్ నుంచి మెజెస్టిక్ వెళ్లడానికి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్(బీఎంటీసీ) బస్సు ఎక్కాడు. టికెట్ ధర రూ. 29 కాగా, రమేశ్ రూ. 30 ఇచ్చాడు. మిగిలిన రూపాయి ఇవ్వాలని కండక్టర్‌ను కోరాడు. కండక్టర్.. చాలామంది కండక్టర్లగానే చిల్లరు ఉందో, లేదో తెలియదుగాని లేదన్నాడు. రమేశ్ మళ్లీ అడిగాడు.
కండక్టర్ సోది..
‘‘ప్రయాణికులు టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వవలెను. నా దగ్గర రూపాయి లేదు. ఎవరైనా ఇస్తే ఇస్తాను’’ అన్నాడు. జర్నీ పూర్తయ్యేలోపు ఆ రూపాయి ఎవరూ ఇవ్వలేదో, బ్యాగులో ఉన్నా ఇవ్వబుద్ధి కాలేదో ఏమోగాని రమేశ్‌కు రూపాయి ఇవ్వలేకపోయాడు. రమేశ్ ఊరుకోకుండా బీఎంటీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లూ పట్టించుకోలేదు. దీంతో తనకు అన్యాయం జరిగిందని, తీవ్ర మానసిక వేదనకు గురయ్యానంటూ జిల్లా వినియోగదారుల కోర్టుకు వెళ్లి, పరిహారంగా రూ.15 వేలు ఇప్పించాలన్నాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు బాధితుడికి రూ. 2 వేల పరిహారంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మరో వెయ్యి కలిపి 3వేలను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఆ గడువులోగా ఇవ్వకపోతే ఏటా రూ.6 వేల వడ్డీ కింద చెల్లించాలని స్పష్టం చేసింది. బీఎంటీసీ కూడా వెనక్కి తగ్గకుండా అప్పీలు వేసింది. అయితే కోర్టు దానికి మొట్టికాయలు వేసింది. ఇది రూపాయి గొడవ కాదని, వినియోగదారుడి హక్కుల పరిరక్షణ అని తేల్చి చెబుతూ పరిహారం కక్కాల్సిందేనని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
Dadasaheb Phalke Awards 2023: దాదాసాహేబ్ అవార్డు విజేతలు ది కాశ్మీర్ ఫైల్స్’ , ఆర్ఆర్ఆర్..!!
హైదరాబాద్‌లో జీ20 సదస్సు.. పొరుగు దేశాలను ఆహ్వానిస్తున్న భారత్