ఆలుమగలు అన్నాక గొడవులు సర్వసాధారణం. కొందరు భార్యభర్తల మధ్య గొడవలు మాత్రం చిత్ర విచిత్రంగా ఉంటాయి. చిన్నచిన్న విషయాలకే చీటికిమాటికి పోట్లాడుకుంటారు. తాజాగా ముంబాయిలో ఓ జంట మంచం కోసం గొడవ పడింది. మంచం నాది అంటే నాది అంటూ ఘర్షణకు దిగి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.
పూర్తి వివరాలు చూస్తే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బొరివిలి ఏరియా రాంబాగ్ లేన్‌కు చెందిన భారభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విడాకుల కోసం భార్య పట్టుబడితే..భర్త మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. దీంతో ఒకే ఇంట్లోనే ఎడమొఖం పెడ మొఖం వేసుకుంటూ ఉంటున్నారు. అదే విధంగా ఇంట్లో సామాన్లు కూడా చెరిసగం పంచుకొని జీవనం సాగిస్తున్నారు. పంచుకోలేని వస్తువులను టైం ప్రకారం ఎవరికివారు ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వాటిలో మంచం ఒకటి. మంచాన్ని గంటల కొద్ది షేర్ చేసుకున్నారు. ఇదే వివాదానికి కారణమైంది. సమయం ముగిసినా మంచాన్ని భార్య వదలకపోవడంతో జనవరి 28 అర్థరాత్రి ఒంటి గంటల సమయంలో ఇరువురి మధ్య గొడవ జరగింది. కోపానికి గురైన భర్త భార్యపై దాడి చేశాడు. గూబ మీద లాగిపెట్టి ఒకటి ఇచ్చాడు. ఆ దెబ్బకు ఆమె చెవి పూర్తిగా దెబ్బతింది. వినికిడి కూడా కోల్పోయింది.అనంతరం ఆస్పత్రికి పోయి వైద్యం తీసుకుంది. తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై కేసుపెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.