ఐదు పైసలు, పది పైసలు, పావలా, అర్ధరూపాయి, ముప్పావలా… ఈ లెక్కలకు ఇప్పుడు విలువ లేదు. అంతా రూపాయలే. ఒక రూపాయకు, రెండ్రూపాయలకు కూడా పెద్దగా విలువలేదు. రూపాయి, రెండ్రూపాయలు ఇప్పుడు బాగానే కనిపిస్తున్నాయి, అంతకంటే చిన్న నాణేలు మాత్రం కనుమరుగయ్యాయి. అవి కూడా చాలామణి అవుతాయని ఆర్బీఐ చెబుతున్నా చాలామంది పట్టించుకోవడం లేదు. ఎక్కడో డబ్బాల్లో మూలుగుతున్నాయి. కొంత వ్యాపారులకు మాంచి ప్రచారంగానూ ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా బిజినెస్ ప్రారంభించినవాళ్లు ‘5 పైసలకే బిర్యానీ, 5 పైసలకే ఫుల్ మీల్స్’ ఆఫర్లు ఇస్తున్నారు. ఐదు పైసలు ఎవరి దగ్గరా ఉండవని, వాటిని దాచుకున్నవాళ్లు కూడా ఐదారుమంది మాత్రమే ఉంటారని ఆఫర్లు పెడుతున్నారు. తర్వాత తీరిగ్గా తలపట్టుకుంటున్నారు. 5 పైసల నాణేలతో వందలమంది ఎగబడ్డంతో ఆఫర్ క్లోజ్ అనేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని ఓ చికెన్ వ్యాపారి మాత్రం టైంకువచ్చినంతమందికీ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఒక మనిషి కేవలం రెండు నాణేలే తీసుకురావాలని షరతు పెట్టాడు. ఆత్మకూరులో 786 చికెన్ షాప్ నిర్వాహకుల ఆఫర్ ఇది. ఇటీవల కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసి ఒక ఐదు పైసల నాణెం తెస్తే అరకిలో చికెన్ ఇచ్చారు. ఫ్లెక్సీ కూడా కట్టి విపరీతంగా ప్రచారం చేశారు. ఆదివారం ఈ ఆఫర్ ఇవ్వడంతో జనం పోటెత్తారు. పట్టణం నుంచే కాక చుట్టుపక్కల పల్లెల నుంచీ తెల్ల పైసలు తీసుకొచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే ఆఫర్ అమలైంది. తర్వాత వచ్చిన వాళ్లు మామూలు ధరకే కేజీ 190కి చికెన్ కొన్నారు. ఆఫర్ మళ్లీ ఇస్తారా అని ఓ మాట అడిగిపోయారు.