Viral News : Man finds live rat in bread packet delivered by Blinkit
mictv telugu

బ్రెడ్డుతో పాటు బతికున్న ఎలుక ఫ్రీ

February 11, 2023

Viral News : Man finds live rat in bread packet delivered by Blinkit

హెం డెలివరీ చేసే సంస్థలు వచ్చాక ఏం కావాలన్నా మార్కెట్‌కి వెళ్లకుండా ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసే సౌలభ్యం వచ్చింది. డెలివరీ సంస్థలు కూడా కస్టమర్ల మెప్పు కోసం అంతేవేగంగా సరుకులను డెలివరీ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్‌లో కొన్నిసార్లు సరిదిద్దుకోలేని తప్పులు కూడా జరుగుతుంటాయి. వేగం కోసమని ఏం డెలివరీ చేస్తున్నామో కనీసం చెక్ చేయకుండా సరుకులు పంపుతున్నారు. సోషల్ మీడియా యుగంలో ఆ తప్పులు తక్కువ సమయంలో వైరల్ అయి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంటాయి. తాజాగా నితినో అరోరా అనే వ్యక్తికి ఫిబ్రవరి 1న అలాంటి అనుభవమే ఎదురైంది. బ్లింకిట్‌లో గ్రాసరీతో పాటు బ్రెడ్ ప్యాకెట్ కూడా అతను ఆర్డర్ చేశాడు. దాని ప్రకారం బ్లింకిట్ ఎగ్జిక్యూటివ్ సరుకులు ఇచ్చేసి వెళ్లిపోయాడు. కానీ సరుకులు తెరిచి చూసిన అరోరాకు కళ్లు బైర్లు కమ్మాయి. బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక దూరి ప్యాకెట్ నుంచి బయటకు రాలేక అలాగే ఉండిపోవడం చూసి వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఇది మనకు వార్నింగ్ లాంటిది. పది నిమిషాల డెలివరీలో ఇలాంటివి ఉండేటట్టయితే నేను గంటల తరబడి వెయిట్ చేయడానికి సిద్ధం’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన బ్లింకిట్ మీకు ఇలాంటి అనుభవం ఇవ్వాలని అనుకోవడం లేదంటూ బదులిచ్చింది. దాంతో పాటు ఘటనపై కఠిన చర్య తీసుకున్నామని పార్ట్‌నర్‌ని ప్లాట్ ఫాం నుంచి తొలగించినట్టు తెలిపింది. దీనిపై నెటిజన్లు కూడా సలహాలు ఇస్తున్నారు. టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు కానీ సురక్షితమైన ఫుడ్ డెలివరీ చేయమని సూచిస్తున్నారు.