ఒక భార్యతో కాపురం చేసి ఇద్దరు ముగ్గురు పిల్లలను కని పోషించాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కష్టంగా ఉంటుంది. కొందరు ఇప్పటికీ ఇద్దరిని పెళ్లి చేసుకొని ఐదారుగురు పిల్లలను కనడం అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ, పాకిస్తాన్లో ఓ డాక్టర్ మాత్రం ఏకంగా ఐదు క్రికెట్ టీంలకు సరిపడేంత కనేశాడు. ఇప్పటివరకు ముగ్గురు భార్యలతో 60 మంది పిల్లలను కన్నాడు. ఇది చాలక 50 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకోవానుకొని పిల్లను చూడమని తన బంధువులు, స్నేహితులకు చెప్పాడంట. ఈ విషయాన్ని ఆ డాక్టరే స్వయంగా మీడియాతో వెల్లడించాడు. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ క్వెట్టా నగరంలో నివసించే సర్దార్ జాన్ మహమ్మద్ ఖాన్ ఖిల్జీ అనే వైద్యుడి కథనం ఇది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఖిల్జీ.. మరింత మంది పిల్లలను కనాలని ఉందని, దానికి తన ముగ్గురు భార్యలు కూడా ఒప్పుకున్నారని అంటున్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంతమంది సంతానం ఉన్నా అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.
మొదటి సంతానానికి 20 ఏళ్లు కాగా ఇప్పటివరకు ఎవరికీ పెళ్లి కాలేదని చెప్తున్నాడు. తన పిల్లలందరూ పాకిస్తాన్ మొత్తం పర్యటించాలనుకుంటున్నారని, అందుకు ప్రభుత్వం సహకరించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే పిల్లల కోరిక తీరుస్తానంటున్నాడు. అసలే పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం, నిధుల కొరత వంటివి తీవ్రంగా వేధిస్తున్న సమయంలో ఎలా పోషిస్తున్నావురా బాబు అనడిగితే తనకున్న క్లినిక్ ద్వారానే పోషిస్తున్నానని, కాకపోతే మూడేళ్ల నుంచి పంచదార, గోధుమపిండి ఇతర ఖర్చులు పెరిగినందున ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉందని సెలవిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లలందరి పేర్లు కూడా తనకు గుర్తుంటాయని చెప్పడం కొసమెరుపు. కాగా, 2050 కల్లా ప్రపంచ జనాభాలో సగం 8 దేశాల నుంచే ఉండవచ్చని ఓ అంచనా. అందులో పాకిస్తాన్ ఒకటి. మనదేశం ఎలాగూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదికాక 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఒక శాతం ఉంటే పాకిస్తాన్లో మాత్రం 1.9గా ఉండడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు