ఈ రోజుల్లో పెళ్లంటే ఓ ప్రెస్టీజియస్ విషయం. తమ దర్జాను, డబ్బును వెదజల్లి మరీ వివాహ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి విలువైన కానుకలను అతిధులకు ఇచ్చి, నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో పెళ్లిల్లు జరుగుతున్నాయి. ఇలాంటి వెడ్డింగ్స్ ఈ మధ్య చాలానే చూశాము. అయితే తాజాగా దుబాయ్‌లో జరిగిన పాకిస్థానీ లగ్జరీ వివాహ వేడుకను చూస్తూ ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోటీశ్వరులను సైతం అవాక్కు అయ్యేలా చేస్తోంది. తులం బంగారం కొనాలంటేనే పదిసార్లు ఆలోచించే ఈ రోజుల్లో వధువుకు ఏకంగా బంగారంతోనే తులాభారం వేసి అందరిని షాక్ కు గురిచేశారు ఆమె కుటుంబ సభ్యులు.
పెళ్లి వేడుకల్లో భాగంగా బంగారాన్ని కట్నకానుకలుగా ఇవ్వడం అనేది భారతదేశం లోనే కాదు అనేక ఇతర దేశాలలో ఓ సంప్రదాయం. ఇది లోతుగా పాతుకుపోయిన విషయం. వరుడు ధగ్గరి నుంచి వధువు వైపు వారి వరకు అందరూ బంగారు ఆభరణాలను ధరించడం, వధూవరులకు బంగారు బహుమతులను ఇవ్వడం సాధారణ విషయమే. కానీ దుబాయ్ లో ఓ పాకిస్థానీ వ్యాపారవేత్త కుమార్తె శరీర బరువుకు సమానమైన బంగారపు ఇటుకలతో తూకం వేయించాడు. 70 కేజీల బంగారాన్ని వరుడికి కట్నంగా అందించాడు. పెళ్లికి వచ్చిన వారందరినీ షాక్ కు గురిచేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలను వస్తున్నాయి. సామాజిక అంచనాలకు తగ్గట్టుగా డబ్బును అనవసరంగా ఉపయోగించడాన్ని విమర్శిస్తున్నారు నెటిజన్లు.
ఈ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ బంగారమంతా నకిలీదని పెళ్లి మొత్తం ఓ థీమ్‌తో జరిగిందని వెడ్డింగ్ ప్లానర్స్ తెలిపారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ జోధా అక్బర్ థీమ్ తో ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. అయితే వివాహ సెటప్ వివాదాస్పదమైనప్పటికీ, వెడ్డింగ్ ప్లానర్లు చాలా కష్టపడి జోధా అక్బర్ కాన్సెప్ట్‌ను రీక్రియేట్ చేశారని నెటిజన్లు వారిని పొగడ్తలతో ముంచారు.