మనిషిని పోలిన మనిషి ఉంటారు అంటారు కదా. కొన్ని సార్లు ఇది నిజమేననిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక కోహ్లీ, సల్మాన్, చంద్రబాబు వంటి ప్రముఖులను పోలిన వ్యక్తుల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిని చూసి అచ్చు గుద్దినట్టు ఉండడం ఎలా సాధ్యమని నెటిజన్లు ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఆ వరుసలో ప్రధాని మోదీ చేరారు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే మోదీని పోలిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఆనంద్ జిల్లా వల్లభ్ విద్యానగర్ ప్రాంతంలో పానీపూరి అమ్మే ఈ వ్యక్తి పేరు అనిల్ భాయ్ ఠక్కర్. అందరూ మోడీలా ఉన్నావని చెప్తుంటే అప్పటినుంచి ఆయనలాగే బట్టలు, ఆహార్యం వంటివి అనుసరిస్తున్నాడు. షాపుకు వచ్చే కస్టమర్లు కొందరు మోదీ టీ అమ్మారు కదా.. నువ్వు పానీపూరి మానేసి టీ అమ్మితే ఆయన స్థాయికి చేరుకుంటావని సరదాగా కామెంట్ చేస్తుంటారని ఠక్కర్ భాయ్ చెప్తున్నాడు. అయితే కేవలం మోదీలా కనపడడమే కాకుండా తన పనిలో ఉన్న స్పెషాలిటీని వీడియోలో ఠక్కర్ భాయ్ వివరించాడు. మీరు ఎక్కడైనా పానీపూరి తింటే ఒకటి నోట్లో వేసుకోగానే వెంటనే మరో పానీపూరి మీ ప్లేటులో పడుతుంది. దీంతో తొందరగా తినేస్తారు కానీ వాటిని ఆస్వాదించలేకపోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తన షాపులో అలా కాకుండా ఓ ప్లేటులో పానీపూరి నింపి పెట్టి కూర్చుని తినే ఏర్పాటు చేశానంటున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో పెట్టిన అనిల్ భాయ్ వీడియోకి ఇప్పటివరకు 82 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.