రేయనక పగలనక చెమటోడ్చి, కష్టనష్టాలను భరించి, ఆరుగాలం శ్రమించి అన్నదాతలు మనుకు కడుపునిండా అన్నం పెడతారు. అలాంటి కర్షకుని శ్రమను దోచుకోవాలనుకున్నాడు ఓ ఆఫీసర్. స్థలానికి సంబంధించిన విషయంలో మార్పులు చేయమని ఆపీసరు దగ్గరకు వెళితే చేయ్యి తడిపితే కానీ పనవ్వదన్నాడు. మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేసే రైతు దగ్గర ఏముంటుంది చెప్పండి. డబ్బులు లేక తాను పెంచుకుంటున్న ఎద్దులను ఆఫీసుకు తోలుకొచ్చాడు. దీనితో ఒక్కసారిగా ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. ఆఫీసర్ తీరుపై ఉన్నతాధికారులు సీరయస్ అయ్యారు. రైతు పని పూర్తి చేసే బాధ్యతను వారే తీసుకున్నారు.
కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన రైతు ఎల్లప్ప రానోజి అనే రైతు మున్సిపల్ రికార్డుల్లో మార్పులు చేయమని రెవెన్యూ అధికారి దగ్గరకు వెళితే అతనికి చేదు అనుభవం ఎదురైంది. లంచం ఇస్తేనే కానీ పని చేయనని ఆఫీసర్ తెగేసిచెప్పాడు . ఉన్నదంతా ఉడ్చి ఆ ఆఫీసర్ చేతిలో పెట్టాడు. తీరా, పని పూర్తి కాకుండానే వేరే చోటకు బదిలి అయ్యాడు ఆఫీసర్. దీంతో రైతు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త ఆఫీసర్ అయినా పని చేస్తాడనుకుంటే అతను లంచం డిమాండ్ చేశాడు. అంతకు ముందున్న ఆఫీసర్ తన దగ్గర డబ్బు తీసుకుని పని చేయలేదని చెప్పినా కనికరించలేదు. లంచం ఇస్తేనే పని జరుగుతుందన్నాడు. దీంతో ఏం చేయాలో తెలిక రైతు తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఎద్దును కార్యాలయానికి తీసుకువచ్చి లంచంగా దీనిని తీసుకోవాలని బతిమాలాడు. తన దగ్గర డబ్బులు లేవని ఎద్దుని అమ్ముకుని పైసలు తీసుకోవాలన్నాడు. దీంతో ఒక్కసారిగా ఆఫీసర్ బండారమంతా బయటపడింది. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి సదరు ఆఫీసర్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లంచం అడిగిన అధికారికి ఫోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎల్లప్పకు తన పని చేసిపెడతామని భరోసా ఇచ్చారు.