రానూ మోండల్ మేకప్..అసలు కథ ఇదీ (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

రానూ మోండల్ మేకప్..అసలు కథ ఇదీ (వీడియో) 

November 21, 2019

సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలను, రాతలను నిజం అని అస్సలు నమ్మలేం. ఎవరికి తోచినట్టు వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. ఏదిబడితే అది రాసేస్తుంటారు. అలాంటివాటిని చూసి సామాన్య జనం నిజం అని నమ్మేస్తుంటారు. దీంతో నిజం ఏమోగానీ అబద్ధం అంబారీ ఎక్కి ఊరేగినంత పని అయిపోతుంది. ఈమధ్య బాలీవుడ్ సింగర్ రానూ మోండల్ మేకప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. కాన్పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రానూ చక్కగా సింగారించుకుని ర్యాంప్ వాక్ చేశారు.  ‘అతిగా మేకప్ వేసుకున్న రానూ మోండల్’ అంటూ ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. అది నిజమని నమ్మిన చాలామంది నెటిజన్లు యుద్ధప్రాతిపదికన రకరకాల కామెంట్లు చేశారు. ‘నడమంత్రపు సిరిని చూసి అతి చేస్తున్న రాను మోండల్’ అని ఎగతాళి చేసినవారే ఎక్కువ. మీమ్స్, జోకులకు లెక్కే లేదసలు. 

ఆమెకు చదువు గనక వచ్చి ఉంటే ఆ కామెంట్లు చదివుంటే ఎంతగా బాధపడేదో పాపం. ఇలా ఆ ఫోటో నిజమో, అబద్ధమో తెలుసుకోకుండా టక్కున స్పందించి చేతులు దులుపుకోవడం వరకే తమ పని అయిపోయిందని భావించే సోషల్ మీడియా ప్రబుద్ధులకు రానూ మోండల్‌కు మేకప్ చేసిన మేకప్ ఉమెన్ సంధ్య గట్టి సమాధానం ఇచ్చారు. రానూ మోండల్ అసలు ఫోటోను, మార్ఫింగ్ ఫోటోతో సహా ఆమె వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో రానూ మండల్‌కు మేకప్ చేసిన విధానాన్ని చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను షేర్ చేసిన సంధ్య ‘ఈ వీడియోను చూస్తే తాను ఎంత కష్టపడి మేకప్ చేశానన్నది తెలుస్తుంది. ఈ మేకప్ ఫోటోను మీ ఇష్టానుసారం ఎడిట్ చేసి జోక్స్ వేస్తున్నారు. ఒకర్ని అవమానపరచడానికి ఇంతగా దిగజారుతారా? ఇది సరికాదు’ అని సంధ్య పేర్కొన్నారు. ఈ వీడియోను చూసి చాలామంది స్పందిస్తున్నారు. ‘పనికిమాలిన దద్దమ్మలు ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తుంటారు. వాళ్ల ప్రమేయం లేకుండానే వారిని అవమానపరుస్తారు. ఆ అబద్ధాన్ని నిజం అనుకున్న కొందరు అజ్ఞానులు పిచ్చి పైత్యంతో కామెంట్లు చేసి వారి మనసును నొప్పిస్తుంటారు. కొంచెం మారండి ఇకనైనా’ అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు.