సినిమా తీయాలంటే భారీ సెటప్పు, భారీ బడ్జెట్, రకరకాల టెక్నీషియన్లు ఆ హడావిడే వేరుగా ఉంటుంది. కానీ కేవలం రూ 1600లతోనే షూటింగ్ చేయవచ్చని ఏపీలోని చిలకమర్రికి చెందిన బాలురు సరదాగా నిరూపించారు. కొన్నేళ్ల క్రితం వీరు తీసిన కామెడీ వీడియో అప్పుడే ట్రెండ్ అవగా, ఇప్పుడు దేశ సరిహద్దులను దాటి విదేశీయులకు కూడా విపరీతంగా నచ్చుతోంది. ఈ వీడియోను ది ఫిజెన్ అనే ఖాతా ఉన్న యువతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్ అయింది. దానికి ‘మీ సినిమా బడ్జెట్ 20 డాలర్ల (రూ. 1600)ఉన్నప్పుడు’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఓ బాలుడు వరండాలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింద పడుకొని మరో బాలుడు సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తున్నాడు. అంటే కెమెరా మెన్ అన్నమాట. ఈ బాల కెమెరామెన్ రెండు కాళ్లను అసిస్టెంట్ లాగుతూ కనిపిస్తాడు. వీరికంటే ముందు మరో చిన్నోడు చెప్పులతో క్లాప్ కొడుతున్నాడు. అయితే ఇదంతా సరదాగా కామెడీగా తీసినా అంతర్జాతీయంగా పాపులర్ కావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ఈ వీడియోకి లైక్ కొట్టడం గమనార్హం. అటు నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టాలెంట్ ఎవడి సొత్తు కాదని, డిజిటల్ యుగంలో ఏదైనా సాధ్యమేనని తమకు తోచిన కామెంట్లు పెడుతున్నారు.