కన్నీరు పెట్టిస్తున్న అమ్మతనం.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

కన్నీరు పెట్టిస్తున్న అమ్మతనం.. వీడియో వైరల్

May 30, 2022

మాతృ వేదన మనుషులకే కాదు నోరు లేని మూగజీవాలకూ ఉంటుంది. బిడ్డలు కష్టాల్లో ఉన్నా.. ఆపదలో ఉన్నా.. కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది అమ్మ. అది మనిషి అయినా పశువు అయినా తల్లి ప్రేమలో తేడా ఉండదు. తాజాగా ఓ ఏనుగుకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బిడ్డకోసం తల్లడిల్లిన ఓ తల్లి ఏనుగు.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తున్నది.

 

పశ్చిమ బెంగాల్‌లోని బనార్హాట్ బ్లాక్‌లోని డోర్స్ ప్రాంతంలో ఓ 30 నుంచి 35 వరకు ఉండే ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఆ గుంపులో ఓ ఏనుగు పిల్ల ఏ కారణం వల్లనో మృతి చెందింది. అయితే చనిపోయిన ఆ గున్న ఏనుగును దాని తల్లి వదిలి పెట్టలేదు. దానిని మోసుకుంటూ ఒక తేయాకు తోట నుంచి మరొక తోటకు కన్నీళ్లతో పరుగులు పెట్టింది. తొండంతో ఆ శవాన్ని పైకి ఎత్తి దంతాల మధ్య పట్టుకుని ముందుకు ప్రయాణం మొదలుపెట్టింది. పచ్చి నీళ్లు, ఆహారం ముట్టకుండా ముందుకు సాగింది. చునాభతి టీ తోటలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు.
చునాభటి నుండి అంబారీ టీ గార్డెన్, డయానా టీ గార్డెన్, నుడువార్స్ టీ గార్డెన్‌లకు వెళ్లి రెడ్‌బ్యాంక్ టీ గార్డెన్‌లోని పొద దగ్గర గున్న ఏనుగు మృతదేహాన్ని ఉంచింది. మిగతా ఏనుగులన్నీ అడవి వైపు మళ్లాయి. కానీ..ఆ ఏనుగుల కదలికలను పరిశీలించిన అధికారులకు ఆ గున్నేనుగు శవం దొరకలేదు.. సరికదా ఆ తల్లి ఏనుగు మంద నుంచి కనిపించకుండా పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ తల్లి ఏనుగును ఎలాగైనా కనిపెట్టి.. అడవుల్లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు