Viral Video: NCC Cadet Thrashes Bhopal Bus Conductor
mictv telugu

రూ. 5 కోసం కండక్టర్‌ను ఎంత ఘోరంగా కొట్టాడో చూడండి..

September 15, 2022

తరచూ బస్సులో ప్రయాణం చేసే వారికి పెరిగే ఆర్టీసీ ఛార్జీలు ఎంత ఇబ్బందిని కలుగజేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే సామాన్యులు, కాలేజీ విద్యార్థులు, ఇంటర్వ్యూలకు వెళ్లే నిరుద్యోగులు.. వేరే దారి లేక బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సులు ఎక్కాక.. టిక్కెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వాల్సిందే. ఒకవేళ చిల్లర ఇవ్వకపోతే.. కండక్టర్‌కు ఇచ్చిన రూపాయి, రెండు రూపాయలను మరిచిపోవాల్సిందే. ఈ మధ్య బస్సు ఛార్జీలు దారుణం పెరిగాయి. అసలు ఏ స్టాప్ నుంచి ఎంత తీసుకుంటున్నారో కూడా తెలియనంతగా పెరిగాయి. దాంతో ఇప్పటికే బస్సులు ఎక్కి.. ఆ జనంలో గంటల తరబడి ఇబ్బంది పడుతూ నిల్చోడం కంటే.. అదే ఛార్జీతో ఆటో ఎక్కి కూర్చోని వెళ్లడమే బెటర్ అని ప్రయాణికులు భావిస్తున్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థపై అసహనంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఓ కండక్టర్ బస్సెక్కిన ప్రయాణికుడి నుంచి టికెట్ కంటే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఒళ్లు మండిన ఆ ప్రయాణికుడు.. కండక్టర్‌ను చితకబాదాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. భోపాల్లో ఓ వ్యక్తి మంగళవారం ఉదయం పోలీస్ హెడ్‌ క్వార్టర్స్ బస్టాప్ దగ్గర బస్సు ఎక్కాడు. తాను దిగాల్సిన స్టాప్‌కు పది రూపాయలే టికెట్. కానీ కండక్టర్ మాత్రం ముందు స్టాప్ నుంచి టికెట్ కొట్టి.. మరో ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఐదు రూపాయలు ఇవ్వాలని లేదంటే దిగిపోవాలని కండక్టర్ గట్టిగా చెప్పాడు.

ఓపిక నశించిన ఆ వ్యక్తి కండక్టర్‌ను అందరూ ముందు ఓ లెవల్లో చితక బాదేశాడు. అయితే బస్సులో ఉండే ఇతర ప్రయాణికులు అతనిని ఆపేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అయితే కండక్టర్‌‌ను కొట్టిన తర్వాత ఆ ప్రయాణికుడు బస్సు దిగిపోయాడు. ఆ వెనకాలే కండక్టర్ పరుగులు తీశాడు. ఇదంతా సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరోవైపు ఈ చర్యపై రవాణా శాఖ పోలీసులను ఆశ్రయించింది. ఆ ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది.