కరోనా రోగిని కొట్టి చంపిన ఆస్పత్రి.. వీడియో వైరల్  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా రోగిని కొట్టి చంపిన ఆస్పత్రి.. వీడియో వైరల్ 

September 19, 2020

Viral video shows nursing staff assaulting Covid patient in Gujarat hospital

మనుషుల ప్రాణాలను హరించడమే కాదు వారిలో ఉన్న దయాదాక్షిణ్నాలను కూడా కరోనా మహమ్మారి చంపేస్తోంది. కరోనా రోగుల పట్ల సభ్య సమాజం ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటివి ఎన్నో దారుణాలు చూస్తున్నాం. అత్యంత నిర్దాక్షిణ్నంగా కరోనా రోగులను హింసిస్తున్నారు. చనిపోయినా దిక్కులేని అనాథ శవాలను చేస్తున్నారు. తాజాగా తాగడానికి నీళ్లు అడిగిన ఓ కరోనా రోగిని ఆసుపత్రి సిబ్బంది కొట్టి చంపారు. కలకలం రేపుతున్న ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 38 ఏళ్ల ప్రభాశంకర్ పాటిల్ అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో పన్నెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అతని కిడ్నీలో నీరు చేరిందని వైద్యులు శస్త్ర చికత్స చేశారు. అనంతరం తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తోందని ప్రభాశంకర్ చెప్పడంతో డాక్టర్లు అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

దీంతో సెప్టెంబర్ 8న రాజ్‌కోట్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేరగా.. కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తనకు తాగడానికి నీరు కావాలని సిబ్బందిని అడిగితే స్పందించకపోవడంతో అతడు దర్నాకు దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన నర్సింగ్ స్టాఫ్ అతనిపై దాడికి పాల్పడ్డారు. పీపీఈ కిట్‌ ధరించిన మెడికల్ స్టాఫ్ అతన్ని కిందపడేసి అతని ఛాతీపై కాళ్లతో తొక్కాడు. సెక్యూరిటీ సిబ్బంది సైతం అత్యంత పాశవికంగా ప్రభాశంకర్ మెడపై కాలుతో తొక్కి పట్టినట్లు వీడియోలో రికార్డు అయింది. ఆసుపత్రి సిబ్బంది దారుణంగా కొట్టడంతోనే సెప్టెంబర్ 12న ప్రభాశంకర్ మృతిచెందినట్లు ఆయన సోదరుడు విలాస్ తెలిపారు. అయితే అతడిపై తాము దాడి చేయలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పంకజ్ వెల్లడించారు. ప్రభాశంకర్ మతిస్థిమితం లేనట్టు ప్రవర్తిస్తున్నాడని.. ఇతర రోగులపై దాడి చేయడానికి ప్రయత్నించాడని చెప్పారు. దీంతో వైద్యసిబ్బంది అతన్ని అదుపు చేయడానికి మాత్రమే ప్రయత్నించారని.. వీడియో చూసిన వారు మాత్రం తమని అపార్థం చేసుకుంటున్నారని స్పష్టంచేశారు.