వినాశకాలే విపరీతబుద్ధే అన్నారు. తిరుపతిలో జరిగిన ఓ దారుణమైన సంఘటన చూస్తే ఇది అక్షరాలా వాస్తవమే అని అపిస్తుంది. పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె భర్త తమ గుట్టు రట్టుచేశాడని భార్య ముందే భర్తకు గుండు కొట్టించాడు ఓ ప్రియుడు. గుండు కొట్టించడంతో పాటు అతనిపై మూత్రం పోసి పైశాచికానందం పొందాడు. జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.
రంగంపేట గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తన భార్యతో గ్రమానికి చెందిన హర్షవర్ధన్ అనే వ్యక్తి అక్రమసంబంధం పెట్టుకోవడంతో, ఎలాగైనా వీరి బండారం బయటపెట్టాలని భర్త రెస్ట్ ఇన్ పీస్ అంటూ సదరు వ్యక్తి ఫోటోను తన ఫేస్బుక్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన ప్రియుడు కోపంతో ఊగిపోయాడు. తన ప్రియురాలి భర్తను పట్టుకుని బలవంతంగా గుండు కొట్టించాడు. అంతటితో ఆగలేదు తనపై మూత్రం పోసి కసి తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే చంపేస్తానని బాధితుడిని బెదిరించాడు. అయితే ఇంత జరుగుతున్నా ఆ దుర్మార్గుడిని ఆపేందుకు ఎవరూ రాకపోగా వీడియోలు, ఫోటోలు తీసి వైరల్ చేశారు. దీంతో ఆనోట ఈ నోట పడి పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులు హర్షవర్ధన్ తో పాటు అతడికి సహకరించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయిన సదరు భర్త అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.