ప్రాంక్ వీడియోస్ పేరుతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో పిచ్చి పిచ్చి చేష్టలతో అలజడి సృష్టిస్తున్నారు కొంతమంది యువతి. బహిరంగ ప్రదేశాల్లో.. ప్రయాణ సాధనాల్లో.. జనాలను బెంబేలెత్తించేలా దిక్కుమాలిన వేషాలు వేస్తున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రోలోని ప్రయాణికులను ఓ యువతి చంద్రముఖి అవతారంలో హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో ఓ యువతి చంద్రముఖి సీక్వెల్ అయిన బాలీవుడ్ హర్రర్, కామెడీ చిత్రం ‘భూల్ భూలయ్య’ సినిమాలోని ముంజులిక పాత్రలోని దుస్తులు ధరించి.. చంద్రముఖినంటూ.. బిత్తర చూపులు చూస్తూ మెట్రోలో కూర్చున్న వారిని భయపెట్టడానికి ప్రయత్నించింది.
ఆ గెటప్ చూస్తే.. బతుకు తెరువు కోసం భిక్షాటన చేస్తున్న యువతిలా కనిపించింది. మెట్రో కంపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్రయాణికుడి వద్దకు నడుచుకుంటూ వెళ్తూ వారిని పట్టుకొని భయపెట్టింది. అయితే యువతిని చూసిన పలువురు ప్రయాణికులు షాకవ్వగా ఓ వ్యక్తి భయంతో ముందుకు పరుగు తీయడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఈ వేషాలేవో స్టేజ్ మీద చేసుంటే ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు వచ్చేదని కొందరంటుంటే… ఇలాంటి వాటిని రియల్ లైఫ్ లో అస్సలు యాక్సెప్ట్ చేయరని మరికొందరు అంటున్నారు. ఈ 50 రుపాయల ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నామని, సెక్యూరిటీని దాటుకొని ఆ యువతి మెట్రోలో ఎలా ప్రయాణం చేయగలిగింది? అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు.