బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచుతో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేశారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో అతి తక్కువ మ్యాచులలో 25 వేల పరుగుల మైలురాయికి చేరుకుని కొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ రికార్డును బద్ధలు కొట్టడం విశేషం. సచిన్ 577 మ్యాచుల్లో 25 వేల పరుగులు చేయగా, కోహ్లీ కేవలం 549 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు.
వీరి తర్వాత రికీ పాంటింగ్ (588), జాక్వలిస్ కలిస్ (594), కుమార సంగక్కర (608), మహేళ జయవర్ధనే (701) మ్యాచుల్లో ఈ మార్కు అందుకున్నారు. అటు వందో టెస్టు ఆడుతున్న పుజారా విన్నింగ్ షాట్‌ను ఫోర్ కొట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పుజారా కంటే ముందు రికీ పాంటింగ్ 2006లో సిడ్నీ వేదికగా ఇలాగే బౌండరీతో తన జట్టును గెలిపించాడు. ఇక రెండో టెస్టులో తన బౌలింగ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన రవీంద్ర జడేజా తన కెరీర్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్సులలో కలిపి 110 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండో స్పెల్‌లో కేవలం 5.1 ఓవర్లు వేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీయడం గమనార్హం. వీటితో పాటు ఢిల్లీ మైదానం కూడా రికార్డుల్లో చేరింది. 1993 నుంచి 2023 వరకు ఆడిన అన్ని టెస్టుల్లో మన జట్టు ఓడిపోయిందే లేదు. కాగా, మూడో టెస్టు ఇండోర్‌లో మార్చి 1 నుంచి జరుగనుంది.
ఫైనల్‌కి అడుగు దూరం
రెండో టెస్టులో విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ దిశగా భారత్ ముందడుగు వేసింది. ఈ విజయంతో పాయింట్ల శాతాన్ని 61.66 నుంచి 64.06కి పెంచుకుంది. ఆస్ట్రేలియా 70.83 నుంచి 66.67కి దిగజారింది. మిగిలిన రెండు టెస్టులలో ఒకటి గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫైనల్ చేరుకుంటుంది.