Virat Kohli was stumped for the first time in his career
mictv telugu

కోహ్లీ, రోహిత్ ఖాతాల్లో అనవసర రికార్డ్.. 2 టెస్టులకు భారత జట్టు ప్రకటన

February 19, 2023

ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ 25 వేల పరుగుల మైలురాయిని అందుకుని సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదే సమయంలో ఆయన కెరీర్‌లోనే తొలిసారి జరిగిన సంఘటన కూడా ఇదే టెస్టులో చోటు చేసుకుంది. తన టెస్టు కెరీర్‌లో కోహ్లీ తొలిసారి స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్ 19వ ఓవర్లో టాడ్ మర్ఫీ వేసిన రెండో బంతికి కోహ్లీ ఫ్రంట్ ఫుట్ షాట్ అడేందుకు యత్నించగా, బంతి మిస్ అయి కీపర్ చేతికి వెళ్లింది. ఏమాత్రం ఆలస్యం చేయని కీపర్.. విరాట్ బ్యాటును క్రీజులో పెట్టేలోపే వికెట్లను గిరాటేశాడు. దీంతో 15 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరీర్‌లో తొలిసారి స్టంపౌట్ అయి అనవసర రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే వరుసలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చేరాడు. 47 టెస్టు మ్యాచులాడిన రోహిత్.. తొలిసారి రనౌట్ అయ్యాడు.

లేని పరుగుకోసం ప్రయత్నించి వందో టెస్టు ఆడుతున్న పుజారాని అవుట్ చేయడం ఇష్టం లేక తన వికెట్‌ని త్యాగం చేశాడు. ఇక మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొదటి రెండు టెస్టుల్లో కొనసాగిన ఆటగాళ్లనే యధాతథంగా ఉంచింది. కనీసం వరుసగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ని అయినా తప్పించి శుభ్‌మన్ గిల్‌కి అవశాశం ఇస్తారేమోనని భావించినా అలాంటిదేమీ జరగకపోవడంతో రాహుల్‌పై మళ్లీ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సిరీస్‌లో మూడో టెస్టు మార్చి 1న ఇండోర్‌ వేదికగా, నాలుగో టెస్టు అహ్మదాబాద్ మోదీ మైదానంలో మార్చి 9 నుంచి 13 వరకు జరుగనుంది.

పుజారాకి ఆసీస్ రిటర్న్ గిఫ్ట్
వందో టెస్టు ఆడిన పుజారా విన్నింగ్ షాట్‌తో జట్టును గెలిపించాడు. ఈ సందర్భంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ భారత డ్రెస్సింగ్ రూంకి వచ్చి ఒక జెర్సీని పుజారాకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. దానిపై ఆసీస్ టీంలోని ఆటగాళ్ల సంతకాలు ఉన్నాయి. అయితే దీన్ని రిటర్న్ గిఫ్ట్‌గా చెప్తున్నారు. 2021లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ భారత్‌పై వందో టెస్టు ఆడాడు. ఆ సమయంలో కెప్టెన్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో రహానె కెప్టెన్‌గా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రహానె టీమిండియా క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీని నాథన్‌కి బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆసీస్ నుంచి పుజారాకి రిటర్న్ గిఫ్ట్ వచ్చినట్టు భావిస్తున్నారు.