మధు తల్లికి రూ. 1.50 లక్షల చెక్కు పంపిన సెహ్వాగ్ - MicTv.in - Telugu News
mictv telugu

మధు తల్లికి రూ. 1.50 లక్షల చెక్కు పంపిన సెహ్వాగ్

April 4, 2018

మధు.. సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియాతో కాస్త టచ్‌లో ఉన్న అందరికీ తెలిసిన పేరు. ఆకలి బాధ తాళలేక ఆహారం దొంగిలించినందుకు సాటి మనుషుల రాక్షసత్వానికి బలైపోయిన యువకుడు. అతని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, లోకంలో మానవత్వపు ఉనికిని ప్రశ్నార్థకం చేసింది.

ఇప్పుడు మధు మళ్లీ వార్తల్లోకెక్కాడు.. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మంచితనమే ఇందుకు కారణం. మధు కుటుంబాన్ని సెహ్వాగ్ ఆదుకున్న సంగతి ఆలస్యంగా తెలిసింది. మధు తల్లి మల్లి పేరుతో అతడు రూ. 1.50 లక్షల చెక్కును పంపించాడు. అయితే ఈ సంగతిని ఎక్కడా బయటికి పొక్కనివ్వలేదు. ఎడమ చెయ్యికి తెలియకుండా కుడిచేత్తో దానం అన్నట్లు వ్యవహరించాడు. ఈ చెక్కు ఫొటోను కేరళ సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సెహ్వాగ్ పెద్దమనసు లోకానికి తెలిసింది. సాయం చేయడం గొప్పవిషయమైతే, ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకపోడం మరింత గొప్పవిషయమని అతన్ని నెటిజన్లు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ నెల 11న చెక్కును అట్టప్పాడిలోని మధు తల్లికి అందిస్తారు.