తెలుగు తేజానికిపై వీరేంద్ర సెహ్వాగ్ కీలక సూచనలు
ఐపీఎల్ 2023లో సత్తా చాటిన క్రికెటర్స్‌లో తెలుగు యువ ఆటగాడు తిలక్ వర్మ ఒకడు. ముంబై సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టోర్నిలో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు. అతడిస్ట్రైక్ రేట్ 164గా ఉంది. ముఖ్యంగా క్వాలిఫయర్ 2 లో తిలక్ తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.కేవలం 14 బంతుల్లోనే 43 పరుగులు చేశి ముంబై గెలుపు కోసం పోరాడాడు. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ బౌలింగ్ లో వరుసగా 4, 4, 4, 4, 2, 6 బాది 24 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి చవిచూసింది. 234 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ 172 పరుగులకే కుప్పకూలిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్ అందరిని ఆకట్టుకుంది.
ఐపీఎల్‌లో తిలక్ వర్మ ప్రదర్శనపై ప్రశంసలు వస్తున్నాయి. అతడి ఆటతీరును మాజీలు కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మను పొగుడుతూనే అతడికి కీలక సూచనలు చేశాడు. తిలక్‌ను చూస్తే 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్లు ఉంది. టీమిండియాకు ఆడినపుడు షోయబ్ అక్తర్ నన్ను అవుట్ చేశాడు. నేను నా బ్యాట్‌తో బంతిని టచ్ చేసే లోపే.. బాల్ నా ప్యాడ్లను తాకింది. అప్పుడు సౌరవ్ గంగూలీ నాకో సలహా ఇచ్చాడు.ఫాస్ట్‌బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చెయ్. అప్పుడే నువ్వు మైదానంలో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలవని చెప్పాడు. నాలాగే తిలక వర్మ కూడా తన బలహీనతలు ఏమిటో తెలుసుకుని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలి. తిలక్ వర్మకు మంచి భవిష్యత్తు ఉందని.. అయితే, చిన్న చిన్న లోపాలను సరిదిద్ధుకోవాలి.
తిలక్ వర్మ మరింత రాటుదేలేందుకు ఫిట్ నెస్, స్కిల్స్ పై దృష్టిసారించాలి. తిలక్ వర్మ ప్రస్తుతం రెగ్యులర్ క్రికెట్ ఆడటం లేదు. ఐపీఎల్, దేశవాళి టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఫిట్ నెస్ మెరుగు పర్చుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యకుమార్ యాదవ్ ఆడే షాట్స్ ఎవరూ ఆడలేరు. అలాంటి రకమైన ఒక స్కిల్‌ను తిలక్ వర్మ నేర్చుకోవాలి" అని వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు.
ఈ సీజన్ లో గాయం కారణంగా తిలక్ వర్మ 5 మ్యాచ్ లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తిలక్ అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపింది.