విశాఖలో భూకబ్జా - ఆవేదనలో అధినేత - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో భూకబ్జా – ఆవేదనలో అధినేత

December 20, 2021

విశాఖపట్నంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరును ఉపయోగించుకొని, కొంతమంది తమ సంస్థను రోడ్డుపైకి తెస్తున్నారని.. విశాఖ హయగ్రీవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు అధినేత జగదీశ్వరుడు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా ఓ సెల్పీ వీడియో ద్వారా మాట్లాడుతూ.. విశాఖలో భూదందాల కోసం కొంతమంది అధికార పార్టీ నాయకుల పేర్లను ఉపయోగించుకొని, గ్యాంగ్‌గా ఏర్పడి, రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. అంతేకాకుండా, సీఎం జగన్, విజయ్ సాయి రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు తన కంపెనీని, తనను రక్షించాలంటూ వేడుకున్నాడు. గత ఇరవై ఐదు ఏండ్లుగా తమ కంపెనీ ద్వారా సివిల్ వర్క్స్ చేస్తున్నామన్నారు.

కొంతమంది వ్యక్తులు తమ సంస్థను చిన్నభిన్నం చేస్తున్నారని, ఈ విషయంలో తనకు పూర్తి న్యాయం చేయాలని కోరాడు. 2004 నుంచి జి. వెంకటేశ్వరావు అనే వ్యక్తి తమ కంపెనీకి అడిటర్ గా వ్యవహరిస్తూ, 2008 నుంచి తమ కంపెనీకి అవసరం ఉన్నప్పుడల్లా ఫైనాన్స్ ఇప్పించాడని తెలిపాడు. ఎంబీబీ నుంచి 15 కోట్ల రూపాయలు ఇప్పించారని, వాటిని తిరిగి కట్టడం కోసం తన పార్వతీపురంలో ఉన్న భూములను అమ్మి, తన బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చిన అమౌంట్ ద్వారా తిరిగి చెల్లించామన్నాడు. తమపై కుట్రలు చేసి, తమ పార్వతీపురంలోని లేఅవుట్ల విషయంలో జీవి మోసం చేశాడని ఆవేదన చెందాడు. తప్పుడు లెక్కలు చూపించి, తమ భూములను తమకే తెలియకుండా అమ్మేశాడని, ఈ విషయంపై ఆయనను నిలదీస్తే, తన వెనక సీఎం జగన్, విజయ్ సాయిరెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు ఉన్నారని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అన్నాడు. కావున దయచేసి మీరంతా స్పందించి నన్ను, నా కంపెనీని నమ్ముకున్న వేలాది మంది కార్మికులను, ఉద్యోగులను రక్షించాలని కోరాడు.