అర్ధరాత్రి మరో అలజడి.. విషవాయువు భయంతో రోడ్లపైనే జనం - MicTv.in - Telugu News
mictv telugu

అర్ధరాత్రి మరో అలజడి.. విషవాయువు భయంతో రోడ్లపైనే జనం

May 8, 2020

Visakha Gas Leak People Goes To Shelter Zone

ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదం విశాఖవాసులను ఇంకా వీడటం లేదు. ప్రజలు ప్రతి క్షణం భయంతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి మరోసారి అలజడి మొదలైంది. పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజీ కావడంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ముక్కు,నోరుకు మాస్కులు ధరించి అర్ధరాత్రి సమయంలో వేరే ప్రాంతాలకు తరలివెళ్తూ జనం కనిపించారు. గాలి గ్యాస్ గాఢత ఎక్కువగా ఉందని, గాలి పీల్చుకోవడమే ఇబ్బందిగా ఉందని అక్కడి ప్రజలు తెలిపారు. ప్లాంట్ నుంచి పొగలు రావడం కనిపించిందని పేర్కొన్నారు.

జనాలకు పడుకునే సమయంలో మరోసారి అలజడి చెలరేగింది. మరోసారి గ్యాస్ లీకైందనే సమాచారంతో ఎన్‌ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వేలాదిమంది  ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాగా ఇప్పటికే ఆర్.ఆర్ వెంకటాపురం పరిధిలో ఉన్న గ్యాస్ లీకేజీ గాఢతను తగ్గించేందుకు గుజారాత్ బృందం వచ్చింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ సంస్థ ప్రతినిధులు కూడా పరిశీలించి ప్రస్తుతానికి ఆ ప్రాంతం సురక్షితంగా ఉందని వెల్లడించారు. నిన్న జరిగిన ప్రమాదంలో 11 మంది మరణించగా వందలాది మంది ప్రజలు విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.