విశాఖ గ్యాస్ లీక్.. కొత్తగా నోళ్లలో పుళ్లు, కాళ్ల నొప్పులు - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ గ్యాస్ లీక్.. కొత్తగా నోళ్లలో పుళ్లు, కాళ్ల నొప్పులు

May 14, 2020

Vishakha

కరోనా సంక్షోభంలో ఎవరూ ఊహించని విధంగా విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనతో కాయాకష్టం చేసుకునే 11 మంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. స్టెరెన్ అనే విషయ వాయువు వెలువడటంతో సుమారు 516 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలావుండగా మూడు రోజుల క్రితం తమకు చికిత్స పూర్తిగా చేయకుండానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేయడంపై బాధితులందరూ కేజీహెచ్ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. తమకు ఇంకా తల తిప్పుతోందని, ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నాయని బాధితులు ఇళ్లకు వెళ్లడానికి నిరాకరించారు.

అయితే బాధితుల్లో ఇప్పుడు కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి. కొంతమంది నోట్లో పుండ్లు ఏర్పడటంతో వారు అన్నం తినలేక అవస్థ పడుతున్నారు. దీంతో వీరి ఆరోగ్యంపై వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వేడి తీవ్రత కారణంగా 15-20 మందికి చర్మం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. మరికొందరు ఛాతిలో నొప్పి, తలనొప్పి, కాళ్ళు లాగడం, వికారం వంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రులు చెక్కుల పంపిణీ కూడా చేపట్టారు.