విశాఖ రైల్వేజోన్‌కు కేంద్రం ఓకే.. నమ్మొచ్చంటారా? - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ రైల్వేజోన్‌కు కేంద్రం ఓకే.. నమ్మొచ్చంటారా?

February 10, 2018

విభజన చట్టం కింద తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రకాలుగా ఆదుకుంటామని కేంద్రం చెబుతోంది. అయితే అన్నీ గాలిమాటలుగానే మిగిలిపోతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో తమకు అన్యాయం జరిగిందని, హామీలను తుంగలో తొక్కారని ఏపీ ఎంపీలు పార్లమెంటును స్తంభించడంతో కేంద్రం కాస్త దృష్టి పెట్టింది.  

హామీ ప్రకారం విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు మీడియాకు లీకులు ఇస్తున్నారు. అయితే ఇదికూడా తమ ఆందోళనపై నీళ్లు చల్లే యత్నమేనని, కేంద్రాన్ని నమ్మలేమని ఎంపీలు చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటుకు ఒడిశా అభ్యంతరాలు వ్యక్తమవుతున్ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ముఖ్యనేతలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో టీడీపీ ఎంపీ,  కేంద్రమంత్రి సుజనా చౌదరి గత రెండు రోజులుగా చర్చించారు.  ఈ రైల్వేజోన్‌ వల్ల ఒడిశాకు నష్టం ఉండదని నచ్చజెప్పారు.

పరిధి తగ్గించి..

మంతనాల్లో నలుగుతున్న ప్రతిపాదన ప్రకారం.. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖ రైల్వే డివిజన్‌తో విశాఖ జోన్‌ ఏర్పాటు చేస్తారు. వాల్తేరు డివిజన్‌లోని 80శాతం ఒడిశా కిందికి వెళ్తుంది.దీనికిధర్మేంద్ర ప్రధాన్‌, ఒడిశా నేతలు అంగీకరించినట్లు సమాచారం. ఈమేరకు త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఇది పాలనా విషయమే కనుక పార్లమెంటులో బిల్లు అక్కర్లేదని, జోన్ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. అయితే హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా స్పందించని కేంద్రం.. ఇప్పటికిప్పుడు ఈ డిమాండ్ ను ఎలా నెరవేరుస్తందనే సందేహాలు వస్తున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హామీని పట్టాలెక్కిస్తారని, తర్వాత వాయిదా వేస్తారని కూడా భావిస్తున్నారు.