నల్లగా మారిపోయిన విశాఖ ఆర్కే బీచ్.. కారణం అదే - MicTv.in - Telugu News
mictv telugu

నల్లగా మారిపోయిన విశాఖ ఆర్కే బీచ్.. కారణం అదే

August 12, 2022

విశాఖ అంటే మొదటగా గుర్తకు వచ్చేది ఆర్కే బీచ్. అక్కడ సాయంత్రం వేళల్లో సముద్రపు అలలను తాకుతూ, తెల్లగా మెరిసిపోయే ఇసుక తిన్నెల్లో కూర్చుని సరదాగా గడపడం చాలా మందికి అలవాటు. దీని కోసమే విశాఖకు వచ్చే పర్యాటకులు ఉంటారనడంతో అతిశయోక్తి లేదు. అయితే ఎప్పుడూ అందంగా ఉండే ఆర్కే బీచ్ ఇప్పుడు నల్లగా మారిపోయింది. దీంతో పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఆందోళనకు లోనయ్యారు. బీచ్‌లో ఇసుక నల్లగా ఎప్పుడూ మారలేదని, ఇప్పుడు అక్కడికి వెళ్లాలంటేనే భయమేస్తుందని వాపోతున్నారు. ఇంత అకస్మాత్తుగా ఎలా నల్లగా మారిందో అంతుచిక్కట్లేదని, ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని భయభ్రాంతులకు లోనవుతున్నారు. దీనిపై ఆంధ్రా విశ్వవిద్యాలయం భూ విజ్ఞాన శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ ధనుంజయను సంప్రదించగా, సముద్రంలో ఉండే మురుగు అప్పుడప్పుడూ ఇలా ఒడ్డుకు కొట్టుకు వచ్చినప్పుడు ఇలా నల్లగా మారుతుందని వెల్లడించారు. అలాగే సముద్రంలోని ఇనుప రజను ఒడ్డుకు వచ్చినప్పుడు కూడా ఇలాగే మారుతుందని, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే ఇసుకను పరిశోధిస్తే అసలు విషయం తెలుస్తుందని, ప్రాథమిక సమాచారం మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉందని పేర్కొన్నారు.