విశాఖపట్నం ఆర్కే బీచ్లో తప్పి పోయిందనుకున్న వివాహిత సాయి ప్రియ.. నెల్లూరులో ప్రియుడితో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. జులై 25 న పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలసి బీచ్ కు వచ్చిన సాయిప్రియ.. భర్త ఫోన్ లో నిమగ్నమై ఉండగా, అతనికి తెలియకుండా ప్రియుడితో జంప్ అయింది. భార్య సముద్రంలో అలలకు కొట్టుకుపోయిందనుకున్న ఆ అమాయకుడు.. ఆమెను వెతికేందుకు అధికారుల సాయం కోరాడు. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేపట్టారు అధికారులు. ఆ తర్వాత ఆమె నెల్లూరులో ఉన్నట్లు ఆమె బంధువులు గుర్తించారు. ప్రేమిడికుడితో కలిసి పారిపోయినట్లు గుర్తించారు.
సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ.కోటి ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టడంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ మాట్లాడుతూ సాయిప్రియ ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని చెప్పారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని.. ఆమెను అక్కడి నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.